ఇటీవల విడుదలైన ప్రభాస్ 'కల్కి 2898' ఫస్ట్ గ్లిమ్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ తోనే కన్ఫామ్ చేసేసారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, లెజెండర్ యాక్టర్ అమితాబచ్చన్, కమలహాసన్, దిశాపటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో మరో యంగ్ స్టార్ హీరో కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్.


గత కొద్ది రోజులుగా ప్రభాస్ 'కల్కి' సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మూవీ టీం అఫీషియల్ గా దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తాజాగా దుల్కర్ సల్మానే ఈ విషయమై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దుల్కర్ నటిస్తున్న లేటెస్ట్ 'మూవీ కింగ్ ఆఫ్ కోథా' ఈ నెలలోనే విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898AD' లో మీరు ఉన్నారా? అని అడిగితే ఈ ప్రశ్నకు దుల్కర్ Yes అని చెప్పలేదు No అని కూడా చెప్పలేదు.


ఇంతకీ దుల్కర్ చెప్పింది ఏంటంటే.. తాను 'కల్కి 2898 ఏడి' సెట్స్ ని సందర్శించానని, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన విధానం తన మొదటి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి ప్రతిదీ పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పాడు. నాగ్ అశ్విన్ కి తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదని అన్నాడు. మరి సినిమాలో మీకు ఎవరితోనైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అని దుల్కర్ సల్మాన్ యాంకర్ అడిగితే.. ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదని, సినిమాలో తాను ఉన్నానో లేదో తనకు తెలియదని, అది మూవీ టీమే చెప్పాలని అన్నాడు. దీంతో దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుల్కర్ ప్రభాస్ కల్కి సెట్స్ ను సందర్శించానని చెప్పడంతో తాను 'కల్కి2898AD' లో నటిస్తున్నాననే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు స్పష్టం అవుతుంది.


మరి మూవీ టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి. దుల్కర్ సల్మాన్ 'కింగ్ ఆఫ్ కోథా' విషయానికి వస్తే.. 1980 - 90 బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. అభిలాష్ జోషి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జి స్టూడియో సంస్థతో కలిసి దుల్కర్ సల్మాన్ తన ప్రొడక్షన్ హౌస్ వెపేరియర్ బ్యానర్ పై  ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్టు 24న మలయాళం తోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Also Read : ‘ఓఎమ్‌జీ 2’కు ఒక్క రూపాయి కూడా తీసుకోని అక్షయ్ కుమార్, అసలు కారణం చెప్పిన నిర్మాత



Join Us on Telegram: https://t.me/abpdesamofficial