మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ క్రమంలో చిరుపై అనేక రూమర్స్ వచ్చాయి. రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి పట్టుబట్టడంతో నిర్మాత తన ఇల్లు, తోటలను అమ్ముకోవాల్సి వస్తోందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే స్పందించింది. అయినప్పటికీ రూమర్స్ కు బ్రేక్ పడలేదు. 'భోళా శంకర్' చుట్టూ అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా స్పందించారు. రూమర్స్ కొంతమందికి క్రూరమైన వినోదాన్ని పంచవచ్చు, కానీ కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం నేరమని ట్వీట్ చేసారు.
''పుకార్లు కొంతమంది వ్యక్తుల క్రూరమైన వినోదాన్ని సంతృప్తి పరచవచ్చు, కానీ ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం అనేది ఆమోదయోగ్యం కాని నేరం. ఇలాంటి వార్తల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను ఎదుర్కొంటున్నాయి. నాకు, చిరంజీవిగారికి మధ్య వివాదం నెలకొందని ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమైనవి. ఆయన అన్ని విధాలా పూర్తిగా సపోర్ట్ చేసారు. ఎప్పటిలాగే ఆయనతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దయచేసి వాస్తవాలపై విద్వేషపూరిత వార్తలను వ్యాప్తి చేయకండి.. ఫేక్ న్యూస్ సృష్టించడం కొంతమందికి సరదాగా వినోదంగా ఉండవచ్చు, కానీ అందులో భాగమైన ప్రతి ఒక్కరికీ అది చిక్కులు తెచ్చిపెడుతుంది. నా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండస్ట్రీలోని శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అని అనిల్ సుంకర ట్వీట్ లో పేర్కొన్నారు.
తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా 'భోళా శంకర్' తెరకెక్కింది. తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏ దశలోనూ కోలుకోలేపోయింది. ఫైనల్ రన్ పూర్తయ్యే నాటికి నిర్మాతకు 50 కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే 'ఏజెంట్' సినిమాతో భారీగా నష్టపోయిన అనిల్ సుంకరకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే చిరంజీవి రెమ్యూనరేషన్ డిమాండ్స్, అనీల్ సుంకర కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు భోళా రిజల్ట్ తో మెగాస్టార్ చాలా హర్ట్ అయ్యారని, కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నారని, అందుకే మోకాలికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారని రూమర్స్ వచ్చాయి. ఇలా రోజుకో పుకారు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అనిల్ సుంకర తాజా ట్వీట్ తో వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసారు.
కాగా, 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూర్చారు. తెలుగులో భారీ ప్లాప్ గా నిలిచిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను 2023 ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: 2023లో అధిక లాభాలు, భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు - ఆ రెండూ 'మెగా' ఖాతాలోనే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial