సినిమాల బడ్జెట్, హీరోల రెమ్యునరేషన్.. ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా ఆసక్తి చూపించేవారు కూడా ఉంటారు. అంతే కాకుండా ఇలాంటి అంశాలు అప్పుడప్పుడు చాలా కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తాయి. ఈరోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి వింటుంటేనే సాధారణ ప్రేక్షకుడికి దిమ్మదిరిగిపోతోంది. అలాంటి ఒక స్టార్ హీరో అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేయగలడా అన్న ఆలోచన కూడా చాలా వింతగా అనిపిస్తోంది కదా. కానీ బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో మాత్రం తనకు కథ నచ్చిందని, ఆ కథను ప్రేక్షకులకు తెలిసేలా చేయాలని అసలు రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా సినిమాలో నటించాడట. ఆ విషయాన్ని స్వయంగా ఆ సినీ నిర్మాతే బయటపెట్టాడు.


‘ఓఎమ్‌జీ 2’తో పోటీపడుతున్న ‘గదర్ 2’..
బాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగినవారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ఇక తాజాగా అక్షయ్ నటించిన ‘ఓఎమ్‌జీ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’తో పోటాపోటీగా ముందుకు వెళ్తోంది. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ నడుస్తోంది. ఇక ‘ఓఎమ్‌జీ 2’ బడ్జెట్ విషయానికొస్తే.. దీనిని రూ.150 కోట్లు ఖర్చుపెట్టి అజిత్ అంధారే నిర్మించారు. అయితే రూ.150 కోట్ల బడ్జెట్‌తో పాటు మరిన్ని ఇతర ఆసక్తికర విషయాల గురించి అజిత్ తాజాగా బయటపెట్టారు.


అక్షయ్, అజిత్‌ల స్నేహం..
అక్షయ్ కుమార్ ‘ఓఎమ్‌జీ 2’ కోసం అసలు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని అజిత్ అంధారే బయటపెట్టారు. అంతే కాకుండా ఆర్థికంగా సినిమా ముందుకు వెళ్లడానికి కూడా చాలా సహాయం చేశాడని తెలిపాడు. ఆర్థికంగా మాత్రమే కాకుండా క్రియేటివ్ పరంగా కూడా ‘ఓఎమ్‌జీ 2’ మేకింగ్‌లో అక్షయ్ సాయం ఉందన్నాడు అజిత్. అక్షయ్, అజిత్‌ల స్నేహం ఈనాటిది కాదు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ‘ఓఎమ్‌జీ’, ‘స్పెషల్ 26’, ‘టాయిలెట్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు కలిసి చేసినా.. అక్షయ్ స్క్రిప్ట్ సెలక్షన్ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని అజిత్ అన్నాడు. ‘తను సెలక్ట్ చేసుకునే స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉన్నా కచ్చితంగా అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. తను లేకపోతే అలాంటి సినిమాలు తీసే సాహసం కూడా ఎవరూ చేయలేరు.’ అంటూ అక్షయ్‌పై ప్రశంసలు కురిపించాడు ‘ఓఎమ్‌జీ 2’ నిర్మాత.


కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే..
‘ఓఎమ్‌జీ’తో పోలిస్తే.. ‘ఓఎమ్‌జీ 2’కు కాస్త ఎక్కువ బడ్జెట్ అయ్యిందని నిర్మాత అజిత్ అంధారే బయటపెట్టాడు. ‘ఓఎమ్‌జీ’ని కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేశామని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘ఓఎమ్‌జీ 2’ కలెక్షన్స్ రూ.79.47 కోట్లని తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ సమయంలో ఈ చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ రావడంతో ఆ మూడు రోజుల్లో ‘ఓఎమ్‌జీ 2’ను చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే అక్షయ్ సినిమా రూ.17.10 కోట్లు కలెక్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ వీకెండ్ కూడా సరైన సినిమా విడుదల కాకపోతే.. ‘ఓఎమ్‌జీ 2’కే ప్రేక్షకులు వెళ్లే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీ నిపుణుల అంచనా.


Also Read: ఆలియా ‘లిప్‌స్టిక్‌’ లొల్లి, రణబీర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్ - పాపం, అలా అనకుండా ఉండాల్సింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial