విలన్ గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి హీరోగా రాణించిన నటుడు శ్రీహరి. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఆయన, ఆస్వస్థతకు గురై లీలావతి హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013న శ్రీహరి చనిపోయారు. కాలేయ సంబంధ వ్యాధితో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సతీమణి డిస్కోశాంతి శ్రీహరి మరణం వెనుకున్న అసలు వాస్తవాలను వెల్లడించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు చెప్పారు. ముంబైలో కాకుండా హైదరాబాద్ లో చికిత్స చేయించి ఉంటే, తను కచ్చితంగా బతికేవారిని చెప్పుకొచ్చారు.  


లీలావతి హాస్పిటల్లో ‘ఠాగూర్’ సినిమా చూపించారు!


“ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కోసం శ్రీహరి ముంబైకి వెళ్లారు. షూటింగ్ జరుగుతుండగా అనారోగ్యం పాలయ్యారు. వెంటనే అక్కడి నుంచి ముంబై లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచారు. శ్రీహరి చనిపోవడానికి కొద్ది సేపటి ముందు డాక్టర్లు చెకింగ్ కు వచ్చారు. అప్పుడు నన్ను బయటకు వెళ్లమని చెప్పారు. కొన్ని మెడిసిన్స్ తో పాటు ఇంజెక్షన్స్ వేయాలని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఓ నర్సు వచ్చి సెలైన్ బాటిల్ లో ఒక ఇంజెక్షన్ వేసింది. కొద్ది సేపట్లోనే ముక్కు, చెవులు, నోటి వెంట రక్తం వచ్చింది. బ్లడ్ క్లీన్ చేసి, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు.  మాట్లాడుతుండగానే శ్రీహరి వాయిస్ లో అయ్యింది. కళ్లు మూతలు పడ్డాయి. వెంటనే డాక్టర్లను పిలిచాను. డ్యూటీ డాక్టర్ వచ్చి చూశారు.  ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెట్టారు. నన్ను వేరే గదికి తీసుకెళ్లారు. శ్రీహరి దగ్గరికి తీసుకెళ్లమని చెప్పినా  తీసుకెళ్లలేదు. నాకు హిందీ సరిగా రాక చాలా ఇబ్బంది పడ్డాను. శ్రీహరి చనిపోయిన తర్వాత కూడా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లలేదు. వైద్యం చేస్తున్నామని చెప్పి చాలా డబ్బు కట్టించుకున్నారు. అక్కడి డాక్టర్లు అచ్చం చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా చూపించారు. నిజానికి శ్రీహరికి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే బతికే వారు. అక్కడి వైద్యులకు శ్రీహరి ఎవరో తెలియదు. లేదంటే జాగ్రత్తలు తీసుకునేవారు. ముమ్మాటికీ శ్రీహరి రాంగ్ ట్రీట్మెంట్ తోనే చనిపోయాడు. హాస్పిటల్ మీద కేసు పెట్టాలని చాలా మంది చెప్పినా, పిల్లలతో కోర్టుల చుట్టు తిరగలేనని భావించి ఆ ప్రయత్నం చేయలేదు” అని చెప్పారు.


చాలా మంది మోసం చేశారు, తాగుడుకు బానిసనయ్యా!


శ్రీహరి చనిపోయిన తర్వాత మనుషులు ఎలా ఉంటారో అర్థం అయ్యిందని చెప్పారు శాంతి. శ్రీహరి చనిపోయాక ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు బయటి ఫ్రెండ్స్ కూడా ఒక్కరూ రాలేని చెప్పారు. కనీసం, తమను పట్టించుకోలేదన్నారు. శ్రీహరి దగ్గర చాలా మంది డబ్బులు తీసుకువెళ్లారు. ఎంతో మందికి ఆయన అప్పులు ఇచ్చారు. కానీ, తను చనిపోయాక ఏ ఒక్కరూ తిరిగి ఇవ్వలేదు. చాలా మంది తమను మోసం చేశారని చెప్పారు. అటు శ్రీహరి పోయిన బాధలో బాగా తాగుడుకు బానిస అయినట్లు చెప్పారు. పిల్లల కోసం ఆ అలవాటును వదులుకున్నట్లు చెప్పారు.    


Also Read: రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆ కామెంట్స్ చేసిన టీవీ చానెల్ ఉద్యోగిపై వేటు?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial