దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న సినిమా సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు రాజమౌళి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మరి రాజమౌళి పోస్ట్ లో ఏముందో తెలుసుకుందాం పదండి.
మహేష్ బాబు సినిమా కోసమే ప్రస్తుతం రాజమౌళి కెన్యాలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన మంగళవారం అంబో సెలి అనే నేషనల్ పార్క్ లో తీసిన ఓ ఫోటోను షేర్ చేయగా అది క్షణంలో వైరల్ అయింది. తాజాగా ఇన్స్టా వేదిక రాజమౌళి మరో ఫోటో పెట్టారు. అందులో అడవికి రారాజుగా పిలిచే సింహం ఫోటో ని షేర్ చేస్తూ "క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంజెటీ రాజుకు సంబంధించిన ఫోటో ఇది. దీని పేరు బాబ్ జూనియర్" అంటూ రాసుకోవచ్చారు. సెరెంజెటీ అనేది టాంజానియాలో ఉన్న ఒక ప్రాంతం. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజమౌళి ఆ ఫోటోకి మహేష్ బాబు పేరుని ట్యాగ్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా ఆ రాజు మహేష్ బాబు అనే విషయాన్ని వెల్లడించారు. దానికి మహేశ్ బాబు కూడా లవ్ ఎమోజీస్ తో రిప్లై ఇచ్చారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. మరి రాజమౌళి కథకి, ఆ సింహానికి, మహేష్ బాబు కి ఎలాంటి లింకు ఉండబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.
కొంతమంది ఇందులో మహేష్ బాబు అడవికి రాజు అనే విధంగా రాజమౌళి హింట్ ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినిమా లొకేషన్స్ లో వేటలో ఉన్న రాజమౌళి అందులో భాగంగానే అక్కడికి వెళ్లారని టాక్ నడుస్తోంది. ఏదేమైనా జక్కన్న చేసే ప్రతి పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఇక రాజమౌళి ఇస్తున్న ఈ వరుస అప్డేట్లతో 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. కాగా 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాను రాజమౌళి, మహేష్ బాబుని హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కథ అని ప్రచారం జరుగుతుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా, దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి లొకేషన్ల వేటలో ఉండగా ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన పాత్ర కోసం సరికొత్త మేకోవర్లోకి ఛేంజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మేకర్స్ 'గరుడ' అనే టైటిల్ ని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.