ఓ సినిమాను నిర్మించాలంటే అందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. సినిమా నిర్మాణం అంత సులభం కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా కోసం కూడా నిర్మాతలు కొన్ని వందల కోట్లు అప్పు చేశారనే విషయం తెలుసా? తాజాగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు బాహుబలి భల్లాలదేవుడు రానా దగ్గుపాటి. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' సినిమా 2015 వ సంవత్సరంలో విడుదలై ఆ సంవత్సరం అతి పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుపాటి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి2 రూ.500 కోట్లు వసూలు చేసింది. అయితే బాహుబలి సినిమా కోసం ఏకంగా రూ.400 కోట్లు అప్పు తీసుకున్నారట నిర్మాతలు.


ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రానా దగ్గుపాటి. సినిమా నిర్మాతలు తమ సినిమాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ రేట్లకు ఎలా వడ్డీలు చెల్లిస్తార నే దాని గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు రానా.  "మూడు నాలుగేళ్ల కిందట సినిమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సినిమా తీసేవాళ్లు తమ ఇంటిన్నో, ఆస్తినో బ్యాంకులో తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బు తెచ్చేవాళ్ళు. ఆ తర్వాత విడిపించుకునే వాళ్ళు. మేము కూడా 24 నుంచి 28% వరకు వడ్డీ కట్టే వాళ్ళం. సినిమాల్లో అప్పులు అలా ఉంటాయి. 'బాహుబలి' లాంటి సినిమా కోసం కూడా రూ.300 నుంచి రూ.400 కోట్ల రూపాయలను ఆ వడ్డీ రేటుకి తీసుకువచ్చారు" అని రానా వెల్లడించాడు.


‘‘బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ 24% వడ్డీ రేటుకు ఐదున్నర ఏళ్ల పాటు రూ.180 కోట్ల అప్పు తీసుకున్నట్లు రానా. దీనికి రెట్టింపు ఖర్చు చేశాం. అందువల్ల మేము చేసిన అప్పు, సినిమా తీయడానికి పడిన కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. రూ. 180 కోట్లను 24 శాతానికి ఐదున్నర ఏళ్ల పాటు నిర్మాతలు అప్పుగా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బాహుబలి 2 కూడా చేసేసాం. ఒకవేళ ఆ సినిమా అప్పుడు ఆడకపోయి ఉంటే ఏం జరిగేదో అసలు ఊహించలేం" అంటూ చెప్పుకొచ్చాడు రానా. దీంతో రానా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.


గతంలో రాజమౌళి కూడా 'బాహుబలి' సినిమాకి ఎదురైన ఆర్థిక కష్టాల గురించి ఓ సందర్భంలో చెప్పాడు. ఒకవేళ ‘బాహుబలి’ సినిమా కనుక ఆడకపోయి ఉంటే తమను ఇంతగా నమ్మి మూడేళ్లపాటు తనతో నిలిచిన నిర్మాతలు మళ్లీ లైఫ్ లో కోలుకోలేని స్థితికి చేరుకునే వారిని రాజమౌళి చెప్పారు. సో ఆ సమయంలో 'బాహుబలి' సినిమాను తీయడానికి అన్ని కష్టాలు పడ్డారు కాబట్టే ఈ రోజు 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ విషయంలో బాహుబలి మూవీ టీమ్ మొత్తాన్ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.


Also Read: కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!