Prabhas: టాలీవుడ్‌ కళాకారుల కోసం ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ (MAA) గురించి ప్రత్యకంగా చెప్పకర్లేదు. సాధారణ పాలిటిక్స్‌ను మించి రాజకీయాలు ఇక్కడ జరుగుతాయి. ‘మా’ వల్ల ఆర్టిస్టులకు ఏమీ లాభం ఉండడం లేదని ఎంతోమంది తెలుగు సీనియర్ నటీనటులు ఎంతోకాలంగా వాపోతున్నారు. ‘మా’తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నటుడు శివాజీ రాజా కూడా దీనిపై స్పందించారు. ఈ విషయంలో హీరోల తప్పు ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అసలు హీరోలు ‘మా’ తరపున మాట్లాడడానికి ఎందుకు బయటికి రావడం లేదో బయటపెట్టారు. ప్రభాస్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు.


ఇంతమంది హీరోలు.. ఇన్నికోట్ల రెమ్యునరేషన్


‘మా’ తరపున ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక అసోసియేషన్ బిల్డింగ్ అనేది కట్టాలని సీనియర్ ఆర్టిస్టులు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయినా ఇప్పటికీ అది ఏర్పాటు కాకపోవడానికి గల కారణాన్ని శివాజీ రాజా బయటపెట్టారు. ముందుగా ఇందులో హీరోల తప్పు ఏమీ లేదన్నారు. ‘‘అడిగేవారు లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది. అడిగేవాడు ఒకడు ఉండాలి ఎప్పుడైనా. ఒకప్పుడు నేను కూడా ఇంతమంది ఉన్నారు, ఇన్ని కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. ఆఫీస్ కట్టలేరా అనుకునేవాడిని. కానీ ఇక్కడ ఎవడి సమస్యల్లో వాడు ఉంటాడు. నేను వెళ్లి ఆఫీస్ కావాలి అని అడిగితే వాళ్లు బయటికి వచ్చారు. చిరంజీవి కూడా అలాగే వచ్చారు’’ అంటూ అమెరికాలో జరిగిన ‘మా’ అసోసియేషన్ మీటింగ్ గురించి గుర్తుచేసుకున్నారు శివాజీ రాజా.


అడిగే మనిషి లేడు


‘‘చిరంజీవి ఉన్న బిజీలో ఆయనకు అమెరికా రావాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా వచ్చారు. మహేశ్ బాబు, నమత్ర దగ్గరకి వెళ్లినప్పుడు చాలా గౌరవంతో మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నారు. ప్రభాస్ దగ్గరకి వెళ్తే.. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకు ఎంత వస్తుంది అని అడిగారు. బిజీగా ఉన్నాను, రాలేను. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను అని అన్నారు. ఇలా ఎంతమంది ఉంటారు? ముగ్గురు పెద్ద హీరోల దగ్గరికి వెళ్తేనే ఇంత అమౌంట్ వచ్చింది. అలాంటిది ఇండస్ట్రీలో ఇంకా చాలామంది మంచి మనసు ఉన్న హీరోలు ఉన్నారు. వీళ్లందరూ తలచుకుంటే ఆఫీస్ కట్టడం చాలా ఈజీ. వాళ్లు ఇవ్వడం లేదు అనేది చాలా తప్పు. అందరూ ఇచ్చే మనుషులే. అడిగే మనిషి లేడు’’ అని స్టార్ హీరోల గురించి గొప్పగా చెప్పారు.


ఒక్క పైసా ముట్టుకోలేదు


‘‘అసోసియేషన్‌లో ఎక్కువ డబ్బులు ఉంచకండి. దాని వల్ల చాలా సమస్యలు వస్తాయని ఒక మీటింగ్‌లో వెంకటేశ్ అన్నారు. అది నిజమే. అసోసియేషన్‌లో డబ్బులు ఉంటే వర్కర్లకు ఆరు నెలలకు సరిపడా జీతాలు మినహా మిగతా డబ్బును ఖర్చుపెట్టాలి. అప్పుడే తరువాత ఎలా అని అసోసియేషన్ సభ్యులు ఆలోచించగలుగుతారు. మేము మాలో పనిచేస్తున్నప్పుడు అసోసియేషన్‌లోని డబ్బులు ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. బయట నుంచే తీసుకోచ్చాం. కష్టపడి చేద్దామనుకునేవాడిని చేయనివ్వరు. ఒకవేళ వాళ్లకి చేద్దామని ఉన్నా చేసే టైమ్ ఉండదు’’ అంటూ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్న పరిస్థితిని వివరించారు శివాజీ రాజా.


Also Read: ‘సలార్’లో ‘కెజీఎఫ్’ స్టార్ యష్, అసలు ట్విస్ట్ ఏమిటంటే..