సమంత రూత్ ప్రభు (Samantha) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. 'యశోద' సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు మయోసైటిస్ బారిన పడిన ఆమె... తర్వాత కొన్ని రోజులు చికిత్సకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ షూటింగులకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమెజాన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' షెడ్యూల్ చేశారు. ఇప్పుడు 'ఖుషి' చేస్తున్నారు. లేటెస్టుగా 'శాకుంతలం' సినిమా చూశారు. 


కుటుంబ ప్రేక్షకులకు కన్నీళ్లు...
సమంత టైటిల్ పాత్రలో, దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన మైథలాజికల్ సినిమా 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఏమీ లేవు. నెల ముందుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యింది. గుణశేఖర్, నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత సినిమా చూశారు. రివ్యూ కూడా ఇచ్చారు.


''ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శకుంతల, దుష్యంత మహారాజు కథకు ఆయన ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన 'దిల్' రాజు, నీలిమా గుణలకు థాంక్స్'' అని సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేశారు.
  
Also Read : రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా






పాటలకు మంచి స్పందన
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'మల్లికా.... మల్లిక', 'ఏలేలో ఏలేలో...', 'ఋషి వనములోన...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. 


తొలుత గత ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాయి. ఎందుకో ఆ తేదీకి రావడం కుదరలేదు. ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తేదీకి సినిమా రాలేదు. రెండుసార్లు వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మరో రెండు సినిమాలు ఉన్నాయి. 'అల్లరి' నరేష్ 'ఉగ్రం', రాఘవా లారెన్స్ 'రుద్రుడు' రానున్నాయి. 'శాకుంతలం' ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సమంత లాస్ట్ సినిమా 'యశోద' రైట్స్ కూడా ప్రైమ్ దగ్గర ఉన్నాయి.


Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్