SebastianPC524 Movie Trailer: 'న్యాయం గొప్పదా? ఉద్యోగం గొప్పదా? అంటే... న్యాయమే గొప్పది' అని కుమారుడితో తల్లి చెప్పింది. మరి, న్యాయం కోసం ఆ కుమారుడు ఏం చేశాడు? తనకు రేచీకటి అనే సంగతి దాచి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన అతడిని ఉన్నతాధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? అనేది తెలియాలంటే 'సెబాస్టియన్ పీసీ 524' సినిమా చూడాలి.
'రాజా వారు రాణి గారు', 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సినిమా 'సెబాస్టియన్ పీసీ 524'. మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరోకి రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్) ఉంటే... పోలీస్ కానిస్టేబుల్‌గా అతడికి నైట్ డ్యూటీస్ పడితే? ఏం జరిగిందనే కథాంశంతో సినిమా తీశారు. యంగ్ సెన్సేషనల్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ రోజు 'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల చేశారు.
సినిమా ట్రైలర్ చూస్తే... నైట్ డ్యూటీస్ నుంచి తప్పించుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు, డ్యూటీలో ఉన్న సమయంలో స్టేషన్‌లో లైట్స్ ఆపేసి చీకటిగా ఉంచడం వంటివి నవ్వించేలా ఉన్నాయి. హీరోయిన్ నువేక్షతో రొమాంటిక్ సీన్, లిప్ లాక్ కూడా చూపించారు. అయితే... మదనపల్లి పాత పట్నంలో మర్డర్ జరగడం, ఆ తర్వాత సెబాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం వంటివి చూపించడం ద్వారా కథపై ఆసక్తి కలిగించారు. ట్రైలర్ మొత్తం మీద 'పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే. పోస్ట్ ఆఫీస్ కి కాదు' అని హీరో కిరణ్ అబ్బవరం, 'నాకు పగులు పూట డ్యూటీలు వేయండి సార్' అని హీరో అడిగితే... 'ఇదేమైనా సాఫ్ట్‌వేర్ ఆఫీసా? డే షిఫ్ట్ చేస్తా, నైట్ షిఫ్ట్ చేయను అనడానికి!?' అని శ్రీకాంత్ అయ్యంగార్ రిప్లై ఇవ్వడం హైలైట్.
Also Read: వేదనలో వేడుకలా వెలుగు సెబా - రాజాధి రాజా!
కోమలీ ప్రసాద్ మరో కథానాయికగా... శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ తదితరులు నటించిన ఈ సినిమాను ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. 'సాహో', 'హీరో' సినిమాల తర్వాత జిబ్రాన్ సంగీతం అందించిన తెలుగు చిత్రమిది.
Also Read: రాత్రిపూట రేచీకటి కానిస్టేబుల్‌కు డ్యూటీనా? ప్రభువు మీదే భారం వేశాడు!