అనగనగా ఓ పోలీస్ కానిస్టేబుల్... అతడి పేరు సెబాస్టియన్! అతడికి రేచీకటి... నైట్ బ్లైండ్ నెస్ అన్నమాట! సాయంత్రం ఆరు దాటితే కళ్లు కనపడవు. తల్లి ఏమో ఎవ్వరికీ ఆ విషయం చెప్పొద్దని చెప్పింది. అందుకని, చెప్పలేదు. కానిస్టేబుల్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అక్కడ రాత్రిపూట డ్యూటీ వేశారు. అప్పుడు ఏం చేశాడు? ఏం జరిగింది? తెలియాలంటే... 'సెబాస్టియన్ పీసీ 524' సినిమా చూడాలి.
'రాజా వారు రాణి గారు', 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'సెబాస్టియన్ పీసీ 524'. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు (శనివారం) టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... క్రిస్టియన్ పేరు పెట్టుకున్న హీరో డ్యూటీలో జాయిన్ అయ్యేముందు గుడికి ఎందుకు వెళ్ళాడు? రేచీకటితో నైట్ టైమ్ డ్యూటీ ఎలా చేశాడు? మిగతా పోలీసులను ఎలా మేనేజ్ చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంది. హీరోయిన్లు కోమలీ ప్రసాద్, నువేక్షను కొన్ని సెకన్లు మాత్రమే చూపించారు.
'దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు' అంటూ ప్రభువు మీద భారం వేసిన హీరో నవ్వించేలా ఉన్నాడు.
శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ తదితరులు నటించిన ఈ సినిమాను ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. 'సాహో', 'హీరో' సినిమాల తర్వాత జిబ్రాన్ సంగీతం అందించిన తెలుగు చిత్రమిది.