ప్రేక్షకుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ పేరు చెప్పడమే ఆలస్యం... సినిమా ఫంక్షన్స్‌లో అతిథులను మాట్లాడనివ్వకుండా ఆడిటోరియంలో ఆడియన్స్ గోల గోల చేసిన సందర్భాలను చాలాసార్లు చూశాం. ఒక్కోసారి పవన్ కల్యాణ్‌ను కూడా ఫ్యాన్స్ మాట్లాడనివ్వరు. పవర్ స్టార్ మైక్ అందుకున్న వెంటనే ఈలలు, చప్పట్లతో తమ అభిమానం చూపిస్తారు. 


కథానాయికలలో పవన్ కల్యాణ్ తరహా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది? అంటే... సాయి పల్లవి పేరు చెప్పాలేమో! సినిమా ఫంక్షన్స్ చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. ఆదివారం రాత్రి 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దర్శకుడు సుకుమార్, హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తీ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుకుమార్ స్పీచ్ ఇచ్చే సమయంలో సాయి పల్లవి పేరు చెప్పారు. అంతే... ఆడిటోరియం అంతా ఈలలు, అరుపులు. ఆడియన్స్ ఒకటే సందడి చేశారు. దాంతో సుకుమార్ కూడా కొన్ని సెకన్లు స్పీచ్ ఆపక తప్పలేదు. సాయి పల్లవి ఆయన దగ్గరకు వెళ్లి 'మీకు మైక్ లో చెప్పాలని అనుకున్నది నాకు చెప్పండి' అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు సుకుమార్ 'ఐ థింక్... నువ్వు లేడీ పవన్ కల్యాణ్' అని అన్నారు.


ఇంతకు సినిమా ఫంక్షన్స్‌లో పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన హంగామా సుకుమార్‌కు గుర్తు వచ్చిందో... ఏమో... సాయి పల్లవిని పవర్ స్టార్‌తో పోల్చారు సుకుమార్. సాయి పల్లవి కూడా మైక్ అందుకున్న తర్వాత ఆమెను ఫ్యాన్స్ మాట్లాడనివ్వలేదు. 'ఈ రోజు ఇక్కడ నేను ఏడిస్తే బావుండదు' అని సాయి పల్లవి అభిమానులకు చెప్పారు. గతంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ఫంక్షన్‌లో ఆమె ఏడ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఫ్యాన్స్ ఆమెకు ఇదే విధమైన రెస్పాన్స్ లభించింది. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.


Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ


సాధారణంగా హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్లకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే... సాయి పల్లవికి ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఆమె అందం చూసి... లేదంటే అభినయం చూసి... ఏదో సినిమా వల్ల ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు ఇది. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్ సాయి పల్లవి వ్యక్తిత్వం చూసి చాలామంది అభిమానులు అయ్యారు. క్రేజ్ ఉందని స్కిన్ షో చేసే ఆఫర్లకు సాయి పల్లవి ఓకే చెప్పలేదు. విజయాలు వచ్చాయని ఆమె ప్రవర్తన మారలేదు. స్క్రీన్ మీద ఎంత హుందాగా ఉన్నారో... స్క్రీన్ బయట కూడా అంతే పద్దతిగా, చక్కటి ప్రవర్తనతో మెలుగుతున్నారు. అందుకని, ఆమెకు ఇంత క్రేజ్. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ఫంక్ష‌న్‌లో సాయి పల్లవి క్రేజ్ మిగతావాళ్ళకు కాస్త ఇబ్బంది కలిగించిందని గుసగుస.


Also Read: 'ఆ హీరో మాటలు బాధించాయి' మూడేళ్ల తర్వాత స్పందించిన సాయి పల్లవి