Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలాఖరున పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ టైటిల్ ఏంటి? దాని వెనకున్న కథేంటి? 'అంటే సుందరానికీ' దర్శక హీరోలు ఈసారి ఎలాంటి పాయింట్ తో వస్తున్నారు? అనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే ఈ ఎస్.జె. సూర్య (SJ Suryah) ఈ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు.


'సరిపోదా శనివారం' సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శక నటుడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను డైరెక్ట్ చేసిన 'ఖుషి' సినిమాకు ఎలా అయితే ముందే కథంతా చెప్పి చేశామో... ఈ మూవీలో ఉన్న కొత్తదనం ఏంటో చెప్తేనే జనాలకు బాగా రీచ్ అవుతుందని సూర్య అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు తాను డైరెక్టర్ కానప్పటికీ, దర్శకుడు ఏం ఫీల్ అవుతారో తెలియదంటూనే పైపైన స్టోరీ ఏంటనేది చెప్పేశారు.


"సినిమాలో నాని చిన్నప్పుడు విపరీతమైన కోపిష్టిగా ఉంటాడు. ఇలానే యాంగ్రీ మ్యాన్ గా పెరిగితే ప్రాబ్లమ్ అవుతుందని భావించిన వాళ్ళ అమ్మ.. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలా అని ఆలోచిస్తుంది. కోపాన్ని అన్ని రోజులు చూపించకుండా, వారంలో ఒక్క రోజు మాత్రమే చూపించు అని తల్లి మాట తీసుకుంటుంది. దాని కోసం అతను శనివారాన్ని ఎంచుకుంటాడు" అంటూ 'సరిపోదా శనివారం' కోర్ పాయింట్ ను ఎస్.జె. సూర్య వెల్లడించారు. 


'బాషా' సినిమా దగ్గర నుంచి ఇంద్ర, బాహుబలి, కల్కి వరకూ అన్ని సినిమాలు ఒకే లైన్ తో తెరకెక్కినవే అని ఎస్.జె. సూర్య అన్నారు. బాషా ఒక మాణిక్యంగా ఉంటాడు... అతను ఎప్పుడు బాషాగా మారుతాడు అనే టెంప్లేట్ మీదనే యాక్షన్ సినిమాలన్నీ నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమా కూడా ఇదే టెంప్లేట్ తో వస్తోందని చెప్పారు. కాకపోతే దీనికి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసి ఎక్స్ట్రార్డినరీగా చూపించాలనే సూపర్ పాయింట్ తో వివేక్ ఆత్రేయ వచ్చారని తెలిపారు.



''ఒక ఆర్డినరీ మ్యాన్ అమ్మకిచ్చిన మాట కోసం ఆదివారం నుంచి శుక్రవారం వరకూ మాణిక్యంలా వుంటే, శనివారం మాత్రం బాషా మాదిరిగా మారిపోతాడు'' అని సూర్య వివరించారు. ఇది నేచురల్ స్టార్ తో చేసిన నేచురల్ మూవీ అని, దీన్ని ఎలా చూపించారనే ఆసక్తిని జనాల్లో కలిగించడానికి డైరెక్టర్ పర్మిషన్ తీసుకోకుండానే స్టోరీ లైన్ చెప్తున్నానని ఆయన అన్నారు. వివేక్ ఆత్రేయ ఈ కథ చెప్పినప్పుడే తన క్యారెక్టర్ బాగా నచ్చిందని, ఇలాంటి పాత్ర చెయ్యాలని అనిపించిందని చెప్పారు.


'సరిపోదా శనివారం' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'సుర్యాస్ సాటర్ డే' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: సందీప్ రెడ్డి వంగా అవన్నీ తప్పని నిరూపించాడు - 'యానిమల్' డైరెక్టర్‌ను ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ