Cannes 2024: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు కొనసాగనుంది. ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పలు సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపికయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలేవంటే..


1. ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ - All We Imagine As Light


‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముంబై కేంద్రంగా నడుస్తుంది. ప్రతిభ, అను అనే నర్సుల చూట్టూ తిరుగుతుంది. ఇందులో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.  పామ్ డి ఓర్‌లో నామినేట్ చేయబడిన ఈ మూవీ మే 23న కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది.


2. సంతోష్ - Santosh


సంధ్య సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సినిమా అన్ సెర్టైన్ రిగార్డ్ అవార్డు విభాగంలో నామినేట్ చేయబడింది. ఈ కథ ఉత్తర భారతదేశంలోని గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. భర్త చనిపోయిన ఓ మహిళ భర్త కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందుతుంది. విధి నిర్వహణలో ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అనేది ఈ చిత్రంలో చూపించారు. షహానా గోస్వామి, సునీతా రాజ్‌వర్‌ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. 


3. సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో - Sunflowers Were The First Ones to Know


పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)కి చెందిన నలుగురు విద్యార్థులు ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. లా సినెఫ్ విభాగంలో ఈ షార్ట్ ఫిలిమ్ ఎంపిక అయ్యింది. చిదానంద్ S నాయక్ దర్శకత్వం వహించిన 16 నిమిషాల లఘు చిత్రం, ఓ గ్రామంలో కోళ్లను దొంగించించే ఓ వృద్ధ మహిళ చుట్టూ తిరుగుతుంది. 


4. మంథన్ - Manthan


ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ తెరకెక్కించిన హిందీ క్లాసికల్ ‘మథన్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడనుంది.  ఇది డాక్టర్ రావు అనే యువ వెటర్నరీ సర్జన్.. పాల సహకార ఉద్యమాన్ని ప్రారంభించే కథతో తెరకెక్కింది. వర్గీస్ కురియన్, శ్యామ్ బెనెగల్ ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పూరి  స్మితా పాటిల్ ప్రధాన పాత్రలు పోషించారు.


5. సిస్టర్ మిడ్‌నైట్ - Sister Midnight


రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ అనే సినిమా కేన్స్ లో ప్రదర్శించనున్నారు. కరణ్‌ కాంధారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్టర్స్‌ ఫార్టునైట్‌ విభాగంలో ప్రదర్శించనున్నారు. కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి ఎలాంటి అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటుంది? తన సమస్యలకు కారణం అయిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించారు.


6. ది షేమ్‌లెస్ - The Shameless


కాన్‌స్టాంటిన్ బోజనోవ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఎంపిక అయ్యింది. ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలోఒక పోలీసును చంపిన తర్వాత, రేణుక అనే యువతి సెక్స్ వర్కర్లతో కలిసిపోతుంది. అక్కడ ఆమె 17 ఏళ్ల దేవికతో ప్రేమను కొనసాగిస్తుంది. సంప్రదాయాలను ఎదిరిస్తూ తమ ప్రేమను కొనసాగించేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఔరోషిఖా డే, ఒమారా, అనసూయ సేన్‌గుప్తా, మితా వశిష్ట్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.


7. ఇన్ ది రీట్రీట్ - In the Retreat


మైసం అలీ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది రిట్రీట్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  అసోసియేషన్ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా విభాగంలో ఎంపిక అయ్యింది. ఈ చిత్రం లడఖ్ కు చెందిన ఓ వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి ఎలా చేరుకుంటాడు? అనే కథాశంతో తెరకెక్కింది.


Read Also: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?