Sai Pallavi Say That She Always Wanted A National Award: సాయిపల్లవి (Sai Pallavi).. తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రోల్ ఏదైనా ఒదిగిపోతూ అచ్చమైన తెలుగమ్మాయిలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నాగచైతన్య సరసన సాయిపల్లవి నటనకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నేషనల్ అవార్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అందుకో బలమైన కారణం ఉందని చెప్తూనే.. తన మామ్మ చీర సెంటిమెంట్‌ను రివీల్ చేశారు.


అసలు కారణం ఏంటంటే.?


'జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే.. నాకు 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు అది కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. నా తొలి చిత్రం ప్రేమమ్ కోసం వర్క్ చేశాను. పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఓ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దాన్ని అందుకున్న అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది.' అని సాయిపల్లవి తెలిపారు. అయితే, ఆమె నటించిన 'గార్గి' చిత్రానికి నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ, ఆ ఏడాది నిత్యామేనన్‌ను అవార్డు వరించింది.


Also Read: మెగా మేనల్లుడితో పాటు 'విశ్వంభర'లో మరో మెగా సెలబ్రిటీ - ఇంట్రో సాంగ్ మామూలుగా ఉండదు మరి


సాయిపల్లవి అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు. తన అందం, సంప్రదాయ వస్త్రధారణ, డ్యాన్స్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. లేటెస్ట్ మూవీ 'తండేల్'తో పాటు ఆమె నటించిన ప్రేమమ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ మంచి విజయాన్ని అందుకున్నాయి. నాగచైతన్య సరసన ఆమె 'బుజ్జి తల్లి'గా తాజా చిత్రం 'తండేల్'లో నటించి మెప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. విడుదలైన రోజు నుంచే రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.


రూ.100 కోట్లకు చేరువలో 'తండేల్'


'తండేల్' సినిమా ఈ నెల 7న రిలీజ్ కాగా.. తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్లతో జోరు కొనసాగిస్తోంది. తొలి 2 రోజుల్లోనే రూ.21 కోట్లతో మొదలై వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.90.12 కోట్లు రాబట్టగా.. తాజాగా, ఈ చిత్రం రూ.95 కోట్ల మార్క్ సైతం దాటేసింది. అతి త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌కు చేరుకుంటుందని చిత్రం బృందం ప్రకటించింది. వీకెండ్స్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరగొచ్చని మేకర్స్ భావిస్తున్నారు. 


Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!