సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ తెర కెక్కుతున్న సంగతి తెలిసిందే. 'చంద్రముఖి 2' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని పి. వాసు డైరెక్ట్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే 'చంద్రముఖి 2' లో కథానాయికగా నటిస్తున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) పాత్రకు మొదట సౌత్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ని అనుకున్నారట చిత్ర యూనిట్. అందంతోపాటు చక్కని హావభావాలు పలికించడంతో పాటు క్లాసికల్ డాన్స్ సైతం ఎంతో చక్కగా చేస్తుంది సాయి పల్లవి. అందుకే మొదట చంద్రముఖి పాత్ర కోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకొని మూవీ టీం ఆమెను సంప్రదించగా, ఆ ఆఫర్ ను సాయి పల్లవి తిరస్కరించినట్లు తెలుస్తోంది.అయితే సాయి పల్లవి ఏ కారణంతో ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం 'చంద్రముఖి 2' సినిమాలో సాయి పల్లవి మంచి పాత్రను రిజెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.


అంతేకాదు కంగనాకి బదులు సాయి పల్లవి ఈ సినిమాలో చేసుంటే అది సినిమాకి మరింత ఆకర్షణగా ఉండేదని పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా పలు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సాయి పల్లవి వాటిని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' మూవీలో చిరు చెల్లెలి పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారు. ఈ మేరకు మూవీ టీం సాయి పల్లవిని సంప్రదించడంతో 'భోళా శంకర్' రీమేక్ మూవీ కావడంతో ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించింది. దాంతో ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కి వచ్చింది.


మెహర్ రమేష్ తెరకెక్కించిన 'భోళాశంకర్' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని అందుకున్నా, సినిమాలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. చివరగా 'గార్గి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే సినిమాలో సాయి పల్లవి నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి తాజాగా తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమాకి కమిట్ అయింది. రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి విశ్వ నటుడు కమలహాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


Also Read : తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్? - సూపర్ స్టార్ సోదరుడి కీలక వ్యాఖ్యలు!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial