HanuMan Movie: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘హనుమాన్’. ఇప్పటికే టాలీవుడ్‌లో కొత్త కథలను తెరకెక్కించే దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పేరు తెచ్చుకున్నాడు. అందుకే తన సినిమాలకు యూత్‌లో చాలా క్రేజ్ లభించింది. ఇప్పుడు మరోసారి ఒక సైన్స్ ఫిక్షన్, డివోషనల్ కథను కలిపి ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి అసలు ఇందులో హనుమంతుడి పాత్రలో నటించింది ఎవరు అని ప్రేక్షకులు ఆరాతీయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఆ కళ్లు ఎవరివి..?
3 నిమిషాల 28 సెకండ్ల నిడివితో ‘హనుమాన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హీరోగా హనుమాన్ అనే పాత్రలో తేజ సజ్జా కనిపించగా.. తన అక్క అంజమ్మ పాత్రను వరలక్ష్మి శరత్‌కుమార్ పోషించింది. ఈ రెండు పాత్రలు చాలా పవర్‌ఫుల్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో విలన్‌గా తమిళ నటుడు వినయ్ రాయ్ కనిపించాడు. ఇతర ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్, సముద్రఖని, గెటప్ శ్రీను వంటి నటులు కనిపించారు. ఇక ఈ ట్రైలర్ చివర్లో కష్టాల్లో ఉన్న హీరోను కాపాడడానికి స్వయంగా హనుమంతుడే వస్తాడని చూపించారు. కానీ ఆ హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనేది చూపించలేదు. కేవలం కళ్లను మాత్రమే చూపించి ప్రేక్షకులను సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో ‘హనుమాన్’ చిత్రంలో హనుమంతుడి పాత్ర పోషించింది చిరంజీవి అని. ఆ కళ్లు ఆయనవే అని రూమర్స్ మొదలయ్యాయి.
హనుమంతుడి సెంటిమెంట్
‘హనుమాన్’ సినిమాలో హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫీల్ అయ్యారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రేక్షకులంతా ఈ పాత్రను కచ్చితంగా ఆయనే పోషించుంటారు అని భావిస్తున్నారు. ఇప్పటికే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో కొన్ని నిమిషాల పాటు హనుమంతుడి పాత్రలో కనిపించారు చిరంజీవి. అంతే కాకుండా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన హనుమంతుడి కార్టూన్ సినిమాకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు. అలా మెగాస్టార్‌కు హనుమంతుడి సెంటిమెంట్ ఉందని, అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొని ఉంటారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరి ప్రేక్షకుల అభిప్రాయం వేరే విధంగా ఉంది.
చిరంజీవి కాదు
‘హనుమాన్’లో పాత్ర కోసం ప్రశాంత్ వర్మ.. చిరంజీవిని సంప్రదించినా కూడా ఆయన రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అందుకే చిరంజీవిలాంటి నటుడు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేని ప్రశాంత్ వర్మ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో హనుమంతుడి పాత్రను క్రియేట్ చేయించినట్టు సమాచారం. ట్రైలర్‌లో హనుమంతుడి కళ్ల షాట్ చూస్తుంటే ఇది కచ్చితంగా ఏఐ పనే అని అంటున్నారు. కానీ చిరు అభిమానులు మాత్రం ఆయన నిజంగానే హనుమంతుడి పాత్రలో కనిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇక ట్రైలర్‌తో సినిమాకు అంచనాలు పెంచేసిన మేకర్స్.. కచ్చితంగా ‘హనుమాన్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.
Also Read: నటి గౌతమి ఆస్తుల కేసులో నిందితులకు ఎదురుదెబ్బ - బెయిల్ నిరాకరించిన కోర్టు