Actor Gautami Cheating  Case: ప్రముఖ నటి గౌతమి భూమిని అక్రమంగా సొంతం చేసుకున్న కేసులో నిందితులకు న్యాయస్థానంలో షాక్ తగిలింది. నకిలీ పత్రాలను సృష్టించి భూములను తమ పేరు మీదికి మార్చుకున్న ఆరుగురి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై నీలాంగరైలో నటి గౌతమికి విలువైన భూములున్నాయి. ఓ నిర్మాతతో పాటు మరికొంత మంది కలిసి ఈ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించారు. తనకు జరిగిన మోసంపై గౌతమి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో నిర్మాత సి.అళగప్పన్‌, ఆయన భార్య నాచ్చాళ్‌, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్‌, కారు డ్రైవర్‌ సతీష్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు.


ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత


ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అళగప్పన్‌ సహా మిగతా ఆరుగురు నిందితులు ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను జస్టిస్‌ కార్తికేయన్‌ విచారించారు.  ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై కేసు నమోదు చేశారని పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే, పోలీసులతో పాటు గౌతమి తరఫున న్యాయవాదులు ఈ మోసం కేసులో వారి పాత్ర ఉందని వెల్లడించారు. వారికి ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని వెల్లడించారు. ఈ వాదానలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. వారి బెయిల్‌ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు.


బీజేపీకి గౌతమి రాజీనామా


మరోవైపు తన ఆస్తులను అక్రమంగా కొట్టేసిన నిందితులకు తన పార్టీ నాయకులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రీసెంట్ గా గౌతమి బీజేపీకి రాజీనామా చేసింది. ట్విట్టర్ వేదికగా తన రాజీనామా లేఖను వెల్లడించారు. ఇందులో పలువురు బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. త‌న‌ను మోసం చేసిన వ్య‌క్తికి బీజేపీ నాయ‌కులు స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు.


“నేను నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కష్టాల్లో ఉన్న నాకు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి ఎలాంటి సపోర్టు లభించలేదు. అంతేకాదు, నన్ను మోసం చేసిన వ్యక్తికే బీజేపీ నాయకత్వం మద్దతు పలుకుతోంది. గ‌త 25 ఏండ్ల నుంచి బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డాను. అయినా, కష్టకాలంలో నాకు అండగా నిలబడలేదు. ఇలాంటి పరిస్థితితో నేను బీజేపీలో ఉండాలి అనుకోవడం లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను” అని లేఖలో వెల్లడించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి పంపించారు.  ప్రాపర్టీ, డబ్బులకు సంబంధించిన విషయంలో తనను మోసం చేసిన అలగప్పన్ తో పాటు ఆయనకు సహకరించిన వారిపై న్యాయపోరాటం చేస్తానని గౌతమి ప్రకటించారు. 






Read Also: వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్, ‘యాత్ర 2‘ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల