Security Breach in Lok Sabha: 


టెక్కీ అరెస్ట్..


పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం  (Security Breach Parliament)ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. బగల్‌కోటేలోని ఆ టెక్కీ ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు ఢిల్లీకి తరలించారు. అరెస్ట్ అయిన యువకుడు మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు కావడం మరింత సంచలనమవుతోంది. లోక్‌సభలో దాడి ఘటనలో ఈ యువకుడి హస్తమూ ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం...ఈ యువకుడి పేరు సాయికృష్ణ జగలి. లోక్‌సభలోకి దూసుకెళ్లి (Lok Sabha Security Breach) కలర్ టియర్‌ గ్యాస్ ప్రయోగించిన మనోరంజన్‌, సాయికృష్ణ మిత్రులు. ఇప్పటికే మనోరంజన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో మనోరంజన్, సాయికృష్ణ చదువుతున్నారు. అక్కడే వీళ్లిద్దరికీ పరిచయమైంది. పైగా రూమ్‌మేట్స్ కూడా. అయితే..మనోరంజన్‌ని విచారించే సమయంలో సాయి కృష్ణ పేరు ప్రస్తావించాడు. అందుకే..పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ రిటైర్డ్ డీఎస్‌పీ కొడుకు. బగల్‌కోటేలోని తన ఇంట్లో నుంచే పని చేస్తున్నాడు. తన అన్న ఎలాంటి తప్పు చేయలేదని మీడియాకి వెల్లడించింది సాయి కృష్ణ సోదరి. 


"ఢిల్లీ పోలీసులు వచ్చిన మాట నిజమే. సాయి కృష్ణను ఏవో ప్రశ్నలు అడిగారు. ఈ విచారణకు మేం పూర్తి స్థాయిలో సహకరించాం. తను ఏ తప్పూ చేయలేదు. మనోరంజన్‌, సాయి కృష్ణ ఇద్దరూ రూమ్‌ మేట్స్. ఇప్పుడు మా అన్నయ్య ఇంట్లో నుంచే పని చేస్తున్నాడు"


- సాయికృష్ణ సోదరి


ఇప్పటి వరకూ ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లు, రైతుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ దాడి చేసినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. అయితే...అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించినట్టు Dainik Jagran వెల్లడించింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ దాడిని తక్కువ అంచనా వేయకూడదని భద్రతా పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ తేల్చి చెప్పినట్టు వెల్లడించింది దైనిక్ జాగరణ్. ఈ ఆర్టికల్ ప్రకారం...ప్రధాని మోదీ ఏం అన్నారంటే..


"లోక్‌సభలో దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఇది చాలా ఆందోళన కలిగించింది. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు. విచారణా సంస్థలు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాయి. అసలు ఈ దాడి వెనకాల ఉద్దేశాలేంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకిలా చేశారో తెలుసుకోవాలి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించాలి. వీటిని వివాదాస్పదం చేయడం కన్నా పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది"


- ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Lok Sabha Security Breach: CISF భద్రతా వలయంలో పార్లమెంట్, దాడి ఘటనతో హోంశాఖ కీలక నిర్ణయం