Security Breach Lok Sabha:


సీఐఎస్‌ఎఫ్ భద్రత..


పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంట్ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో Central Industrial Security Force (CISF) కి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖల బిల్డింగ్‌లకు భద్రత కల్పిస్తున్న CISFకే ఈ బాధ్యత అప్పగించనుంది. ఎయిర్‌పోర్ట్‌లు, ఢిల్లీ మెట్రోలోనూ ఈ సిబ్బందే భద్రతనిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..కేంద్ర హోం శాఖ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. పార్లమెంట్ బిల్డింగ్ కాంప్లెక్స్ సెక్యూరిటీపై సర్వే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ తరవాత అవసరాలకు అనుగుణంగా CISF భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.


ఇప్పటి వరకూ పార్లమెంట్ భద్రత బాధ్యత ఢిల్లీ పోలీసులకే ఉండేది. అయితే...ఇటీవల లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకురావడం సంచలనం సృష్టించింది. పార్లమెంట్ సెక్యూరిటీని రివ్యూ చేసుకుని మరింత పటిష్ఠంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అందుకే...కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించింది. చివరకు ఢిల్లీ పోలీసులకు బదులుగా CISF సిబ్బందికి పార్లమెంట్ భద్రతను అప్పగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సభలోకి వచ్చే వాళ్లను చెకింగ్‌ చేసే బాధ్యతనూ CISFకే అప్పగించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భద్రత బాధ్యతలు మాత్రం లోక్‌సభ సెక్రటేరియట్‌ పరిధిలోనే ఉంటాయి. ఢిల్లీ పోలీసులు వెలుపల భద్రత కల్పిస్తారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ని పూర్తిగా మార్చేయడంతో పాటు రకరకాల సెక్యూరిటీ ఏజెన్సీలకు భద్రత బాధ్యతలు అప్పగించే బదులు పూర్తిగా ఒక ఏజెన్సీకి ఇవ్వడం మంచిదని హోంశాఖ భావించింది. పబ్లిక్‌ సెక్టార్‌కి సంబంధించిన పలు కార్యాలయలకు CISF భద్రత అందిస్తోంది. మొత్తంగా 350 సెన్సిటివ్ లొకేషన్స్‌లో సెక్యూరిటీ ఇస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ (PSS), ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, CRPF ఏజెన్సీలు CISFకిందే విధులు నిర్వర్తించనున్నాయి.  


Also Read: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక అధికారం కేంద్రానిదే, లోక్‌సభలో బిల్లుకి ఆమోదం