CEC Bill Passed:


బిల్లు ఆమోదం..


లోక్‌సభలో మరో కీలక బిల్లు ఆమోదం పొందింది. Chief Election Commissioner తో పాటు ఇతర ఎన్నికల అధికారుల నియామకానికి ఉద్దేశించిన బిల్లుని సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందగా..ఇప్పుడ లోక్‌సభలోనూ లైన్ క్లియర్ అయింది. ఇవాళ్టితో (డిసెంబర్ 21) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈలోగా తాము అనుకున్న అన్ని కీలక బిల్స్‌నీ ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే...ప్రతిపక్ష ఎంపీలు లేకుండానే ఇవి ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం జరిగిపోయాయి. డిసెంబర్ 12న ఈ బిల్‌ని ప్రవేశపెట్టినప్పుడే ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగస్టు 10వ తేదీనే ఈ బిల్లుకి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్‌ని ( Chief Election Commissioner Bill 2023) నియమించే అధికారం ఇకపై పూర్తిగా కేంద్రానికే ఉంటుంది. అయితే...ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాలని, ఆ కమిటీకి మాత్రమే ఈ అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఈ విషయంలో ఓ చట్టం చేసేంత వరకూ ఇదే పద్ధతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్లుగా ఎవరు ఎన్నికైనా సరే..వాళ్లకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ే






చీఫ్ జస్టిస్ లేకుండానే..


అయితే ఈ కమిటీలో చీఫ్ జస్టిస్‌ కూడా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. చీఫ్ జస్టిస్‌ జోక్యం లేకుండానే ఎలక్షన్ కమిషనర్‌ని ఎన్నుకునేలా కొత్త బిల్లు రూపొందించింది. ఈ బిల్లులో మరో కీలకమైన అంశం ఉంది. సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కానీ ఇతరత్రా ఎన్నికల అధికారులు కానీ తమ పదవీకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు అవి వివాదాస్పదమవుతాయి. అలాంటి నిర్ణయాలపై లీగల్‌గా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ...కేంద్రం రూపొందించిన బిల్లులో మాత్రం వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయభద్రత కల్పించేలా ప్రొవిజన్స్ పెట్టారు. ఈ అధికారులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ చేయడంపై ఆంక్షలు విధించింది కొత్త బిల్లు. ఇదే వివాదాస్పదమవుతోంది. పలువురు ఎంపీలు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించారు. AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం అసహనం వ్యక్తం చేశారు. కేవలం కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని పెంచుకోడానికే ఈ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. 


Also Read: Lok Sabha Security Breach: CISF భద్రతా వలయంలో పార్లమెంట్, దాడి ఘటనతో హోంశాఖ కీలక నిర్ణయం