రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘RRR’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘‘నాటు నాటు’’ సాంగ్‌కు వీర లెవల్‌లో వైరల్ అయ్యింది. చివరికి ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఆ మూవీకి దర్శకత్వం వహించిన రాజమౌళికి గానీ.. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గానీ వేదికను పంచుకొనే అవకాశం కూడా రాలేదు.


ఏదైతేనేం.. తెలుగు సినిమాకు అంతర్జాతీయ వేదికపై అరుదైన గుర్తింపు లభించింది. అంత వరకు వెళ్లడమే గ్రేట్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఆ మూవీని ఆ స్థాయిలో చిత్రీకరించిన జక్కన్నకు తగిన గుర్తింపు రాకపోవడమే ఆయన అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా తాజాగా వెల్లడించిన 69వ జాతీయ సినిమా అవార్డుల్లో. అదేంటీ.. ‘RRR’కు ఆరు అవార్డులు వచ్చాయి కదా అనేగా మీ సందేహం. ఔను వచ్చాయి. కానీ, రాజమౌళికి రాలేదు. 


‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఒక్కరికి అవార్డు వచ్చినా.. రాజమౌళికే క్రెడిట్ దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మూవీ కోసం తమ సిబ్బందిపడిన శ్రమకు గుర్తింపు రావడం ఆయనకు కూడా సంతోషకరమే. అయితే, ఆయన అభిమానులు మాత్రం అలా ఆలోచించే అవకాశం లేదు. ఆయన క్రియేటివ్ మైండ్‌‌కు, శ్రమకు తగిన గుర్తింపు రాలేదనే కోణంలోనే ఆలోచిస్తారు. ఉత్తమ దర్శకుడు అవార్డు తప్పకుండా రాజమౌళికి దక్కాల్సిందేనని, ఈ విషయంలో రాజమౌళికి అన్యాయం జరుగుతోందని అంటున్నారు. పోనీ, ఏదో విధంగా రాజమౌళి సినిమాను అవార్డులు వరిస్తున్నాయి. ఇది కూడా రాజమౌళికి లభించే గౌరవమే. కానీ, ‘ఆర్ఆర్ఆర్’కు సినిమాకు తమ నటనతో ప్రాణం పోసిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా గుర్తింపు రాకపోవడం ఆయన అభిమానులను మరింత బాధిస్తోంది.


ఇంకో విషయం ఏమిటంటే.. ఊహించని విధంగా పుష్పరాజ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోవడం. తెలుగు హీరోకు ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డు రావడం నిజంగా గర్వించదగిన విషయం. అయితే, ఆ అవార్డు మా హీరోలకు రాలేదే అనే బాధ ఆయా హీరోల అభిమానులను వెంటాడుతోంది. చిరంజీవి వారి బాధను దూరం చేసే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్‌ను అభినందించారు. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కూడా బన్నీని అభినందించారు. అయితే, రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు బన్నీని విష్ చేయకపోవడం గమనార్హం. 


RRR మూవీకి వచ్చిన నేషనల్ అవార్డ్స్ ఇవే


⦿ బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు)
⦿ బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సాల్మన్
⦿ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) - ఎంఎం కీరవాణి
⦿ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాలభైరవ (కొమరం భీముడో)
⦿ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - శ్రీనివాస మోహన్
⦿ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ - ఆర్ఆర్ఆర్


తెలుగు సినిమాకు వచ్చిన అవార్డులివే


⦿ జాతీయ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్
⦿ ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్
⦿ ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన
⦿ ఉత్తమ గేయ రచన - చంద్రబోస్ (కొండపొలం)
⦿ బెస్ట్ క్రిటిక్ (నాన్ ఫీచర్) - పురుషోత్తం చార్యులు


Also Read: జాతీయ ఉత్తమ నటుడిగా జెండా పాతిన మొట్టమొదటి తెలుగోడు - ఇది పుష్ప రూలు!