కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్ (గంగూబాయి) & కృతి సనన్ (మిమి) సంయుక్తంగా గెలుచుకున్నారు. ఈసారి నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు డామినేషన్ చూపించాయి. తెలుగు చిత్రాలకు 11 పురస్కారాలు వస్తే, వాటిలో 6 అవార్డులు RRR మూవీకి దక్కాయి. అయితే ఈ చిత్రం 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్ ఎందుకు ఇచ్చారు? అదే 2022 లో విడుదలైన 'KGF 2' చిత్రాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జాతీయ చలన చిత్ర అవార్డులకు ప్రమాణాలు ఏంటి? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
భారతీయ సినీ రంగంలో అందించే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. దేశవ్యాప్తంగా గత సంవత్సరంలో నిర్మించబడిన చిత్రాలను ఎంపిక చేసి, వాటిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఏదైనా సినిమా జ్యూరీ పరిశీలనకు అర్హత పొందాలంటే, జనవరి 1 - డిసెంబర్ 31 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడాలి. ఇప్పుడు 2021 సంవత్సరంలో సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ పొందిన సినిమాలను పరిగణలోకి తీసుకొని, 69వ చలన చిత్ర అవార్డులను ప్రకటించబడ్డాయి.
RRR మూవీ 2022 మార్చిలో రిలీజైనప్పటికీ, అంతకు ముందే సెన్సార్ చేయబడింది. 2021 నవంబర్ 25న సెన్సార్ సభ్యుల నుంచి సర్టిఫికెట్ జారీ చేయబడింది. అలానే 'చార్లీ 777' సినిమా గతేడాది విడుదలైనప్పటికీ 2021 లోనే సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. మరోవైపు 'KGF 2' సినిమా 2022 లో సెన్సార్ చేయబడి, అదే ఏడాది ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. ఈ కారణం చేతనే 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కోసం 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'చార్లీ 777' చిత్రాలను పరిగణనలోకి తీసుకున్న జ్యూరీ.. 'KGF 2' సినిమాని కన్సిడర్ చేయలేదు. దీని ప్రకారం 'KGF చాప్టర్ 2' మూవీని వచ్చే ఏడాది 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల కోసం పరిశీలనలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
Also Read: National Film Awards 2023: జాతీయ ఉత్తమ నటుడిగా జెండా పాతిన మొట్టమొదటి తెలుగోడు - ఇది పుష్ప రూలు!
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 2021లో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయబడి, థియేటర్లలో విడుదల కాని సినిమాలు కూడా 69వ జాతీయ చలన చిత్ర అవార్డులకు అర్హత సాధించినవే అవుతాయి. గతంలో 67వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో మోహన్ లాల్ నటించిన 'మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' అనే మలయాళ సినిమా విడుదలకు ముందే మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సినిమా 2019లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందడంతో 2020 అవార్డుల కోసం పరిగణలోకి తీసుకున్నారని స్పష్టత వచ్చింది.
ఇకపోతే భారత ప్రభుత్వం 1973 నుంచి జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. ఫీచర్ ఫిల్మ్స్ మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్స్ వంటి రెండు ప్రధాన విభాగాలలో ఈ పురష్కారాలు అందించబడతాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా జ్యూరీ సభ్యులు నియమించబడతారు. ఏ సినిమాలను పరిశీలనకు ఎంపిక చేస్తారు? చివరికి ఏ చిత్రాలకు అవార్డులు ఇస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం లేదా డైరెక్టరేట్ ప్రభావం ఉండదని పేర్కొనబడింది. జ్యూరీ ప్యానెల్‌ల పరిశీలనకు వచ్చిన సినిమాలకు అర్హత ఉందో లేదో అనే విషయంలో కఠినమైన ప్రమాణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రూపొందించబడి, ఫీచర్ & నాన్-ఫీచర్ క్యాటగిరీలలో అవార్డుల కోసం నమోదు చేయబడ్డ సినిమాలు మాత్రమే అర్హులుగా పరిగణించబడతాయి. అలానే జనవరి 1 మరియు డిసెంబర్ 31 మధ్య చలనచిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడాలి. ఫీచర్ ఫిల్మ్‌గా పరిగణించాలా లేదా నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా పరిగణించాలా అనేది ఫీచర్ ఫిల్మ్ జ్యూరీచే నిర్ణయించబడుతుంది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ కు ఎంపికైన వారికి భారత రాష్ట్రపతి చేతులు మీదగా పురష్కారాలు అందజేయబడతాయి.
2021 సంవత్సరానికి గాను 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 రచనా విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది.
Also Read: National Film Awards-2023 Complete List: 69వ జాతీయ అవార్డుల విజేతలు వీరే!