RRR Six National Awards: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు జాతీయ అవార్డుల పంట పండింది. ఏకంగా ఆరు జాతీయ అవార్డులను ‘ఆర్ఆర్ఆర్’ గెలుచుకోవడం విశేషం. జాతీయ అవార్డు చరిత్రలోనే ఇది మూడో అత్యధికం.


ఎనిమిది అవార్డులతో ఆమిర్ ఖాన్ ‘లగాన్’ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే జంటగా నటించిన ‘బాజీరావు మస్తానీ’ రెండో స్థానంలో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘గాడ్‌మదర్ (హిందీ)’, ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్ (తమిళం)’, ‘ఆడుకలం (తమిళం)’ సినిమాలు కూడా ఆరు అవార్డులను సాధించాయి.


ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన అవార్డులు ఇవే
1. బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు)
2. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సాల్మన్
3. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) - ఎంఎం కీరవాణి
4. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాలభైరవ (కొమరం భీముడో)
5. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - శ్రీనివాస మోహన్
6. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ - ఆర్ఆర్ఆర్


ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ కూడా...
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్  'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటిస్తారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదని, కానీ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ విషయంలో చాలా ప్లాన్స్ ఉన్నాయని, ఈ చిత్రాన్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది.


ఆ ఇద్దరిలో ఒకరు ఫైనలా?
సినిమా పరిశ్రమలో మాత్రం 'RRR' సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి తనయుడు కార్తికేయ అరంగేట్రం చేయబోతున్నట్లు పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి కార్తికేయ ‘ఆర్ఆర్ఆర్’ కోసం సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనేక ముఖ్యమైన సన్నివేశాలను ఆయనే తెరకెక్కించారు.  ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో, ఆస్కార్‌కు ఈ చిత్రం నామినేషన్‌  పొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నిర్మాణంలో ఆయనకున్న అనుభవం దృష్ట్యా 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కు కార్తికేయ దర్శకత్వం వహించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


ఒకవేళ కార్తికేయ 'ఆర్ఆర్ఆర్'  సీక్వెల్ దర్శకత్వ  బాధ్యతలు చేపట్టకపోతే, ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి గతంలో అయాన్ ముఖర్జీ ప్రతిభను ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ కి కార్తికేయ సారథ్యం వహిస్తాడని అభిమానులు, సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా,  భవిష్యత్తులో కార్తికేయ దర్శకత్వంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Read Also: ‘దృశ్యం’ కాంబో దూకుడు- ఒక మూవీ షూట్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial