Delhi Ganesh Passed Away: తమిళ చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్. వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మరణించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలను ఈరోజు (నవంబర్ 10వ తేదీ) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మహాదేవన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
400కు పైగా సినిమాల్లో...
ఢిల్లీ గణేష్ తమిళంలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1976 సంవత్సరంలో బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పత్తిన ప్రవేశం’ అనే తమిళ సినిమా ద్వారా ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా ఢిల్లీ గణేష్ నటించారు. తమిళంలో సింధు భైరవి, నాయకుడు, అపూర్వ సగోదరగళ్, మైకేల్ మదన కామ రాజు, ఆహా, తెనాలి, హే రామ్, ఇరువర్ వంటి ప్రముఖ సినిమాల్లో ఈయన నటించారు.
Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!
మెగాస్టార్ చిరంజీవికి డబ్బింగ్ కూడా...
కె.బాలచందర్ దర్శకత్వంలో ‘47 నాట్కల్’ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన కుమార్ పాత్రకు ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ‘కాదల్ దేవతై’లో కూడా మెగాస్టార్ పాత్రకు ఢిల్లీ గణేష్‌నే డబ్బింగ్ చెప్పడం విశేషం. చిరంజీవితో పాటు విష్ణు వర్థన్, ప్రదీప్ పోతన్, నెడుముడి వేణు లాంటి దిగ్గజ నటుల పాత్రలకు కూడా తమిళంలో ఆయన డబ్బింగ్ చెప్పారు.
‘ఇండియన్ 2’లో చివరిసారిగా...
కమల్ హాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’లో ఢిల్లీ గణేష్ చివరిసారిగా కనిపించారు. 2024లో ఆయన విశాల్ హీరోగా నటించిన ‘రత్నం’, సుందర్ సి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన ‘అరణ్మనై 4’ సినిమాల్లో కూడా నటించారు. ఆయన మృతిపై పలువురు సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.