రష్మిక డీప్ ఫేక్ (మార్ఫింగ్) వీడియో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు సామాన్య ప్రేక్షకులలో సైతం చర్చనీయాంశం అయ్యింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఎటువంటి వీడియోలు క్రియేట్ చేయవచ్చనేది ఈ ఘటనతో ఒక ఐడియా వచ్చింది. సెలబ్రిటీలు, ముఖ్యంగా మహిళలకు టెక్నాలజీ ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయనేది ఒక అంచనా వచ్చింది.
మార్ఫింగ్ వీడియో ఘటనలో రష్మికకు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆమె కంటే ముందు లెజెండరీ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫేక్ వీడియో చేయడం తగదంటూ, ఆ ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు రష్మికకు మద్దతుగా మరింత మంది సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.
భయం వేస్తుంది : నాగ చైతన్య
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ట్విట్టర్ వేదికగా అక్కినేని నాగ చైతన్య స్పందించారు. సాంకేతికతను ఈ విధంగా దుర్వినియోగం చేస్తుంటే నిరుత్సాహం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే మార్పులను చూస్తుంటే భయం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా, బాధితులకు రక్షణ కలిగించేలా చట్టాలు తీసుకు రావడం అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్
వాళ్ళను చూస్తుంటే సిగ్గేస్తోంది : మృణాల్ ఠాకూర్
ఇటువంటి పనులు (డీప్ ఫేక్ వీడియో, మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసే) వాళ్ళను చూస్తుంటే సిగ్గేస్తోందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇన్స్టా స్టోరీలో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన రష్మికకు ఆమె థాంక్స్ చెప్పారు. ఒకవేళ మౌనంగా ఉంటే ఇటువంటివి జరుగుతాయని ఆమె అన్నారు. ప్రతి రోజూ సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని... మహిళా ఆరిస్టుల ఫోటోలను జూమ్ చేసి మరీ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని మృణాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము నటీనటులమే అయినప్పటికీ... తాము కూడా మనుషులమే అని ఆమె అన్నారు. సమాజం ఎటు పోతోందని ఆమె ప్రశ్నించారు.
Also Read : దంచి కొట్టు, త్రివిక్రమ్ మార్క్ మాస్ సాంగ్ - మహేష్ 'దమ్ మసాలా' వచ్చేసిందోయ్
యువ హీరో సాయి ధరమ్ తేజ్, నటి ఖుష్భూ, గాయని చిన్మయి కూడా ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడటం అవసరం అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరో వైపు తన బాడీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారని బ్రిటిష్ ఇండియన్ మోడల్ జరా పటేల్ పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని, వీడియో క్రియేట్ చేయడంలో తన ప్రమేయం ఏమీ లేదని ఆమె పేర్కొన్నారు.