Guntur Kaaram Dum Masala Lyrical Song released : సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా సినిమాలో మొదటి పాట 'దమ్ మసాలా'ను విడుదల చేశారు. 


'దమ్ మసాలా'... ఎలా ఉందేంటి?
'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'దమ్ మసాలా...' కోసం ఆయన అందించిన బాణీకి సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంజిత్ హెగ్డేతో కలిసి సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను పాడటం విశేషం. 


త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతకు ముందు రామ జోగయ్య శాస్త్రి పాటలు రాశారు. ఈ పాట అన్నిటి కంటే స్పెషల్ అనేలా ఉంది. బుర్రిపాలెం బుల్లోడు అంటూ మహేష్ సొంతూరు గుర్తుకు తెచ్చారు. సుర్రు సురక ఈడు అంటూ హీరోతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ముందు హింట్ ఇచ్చారు. మాసీ సాహిత్యంతో సాంగ్ అంతా సాగింది. మధ్యలో త్రివిక్రమ్ మార్క్ కూడా కనిపించింది. 'నేనో నిశ్శబ్దం... అనినిత్యం నాతో నాకే యుద్ధం' లైనులో మాటల మాంత్రికుడి టేస్ట్ స్పష్టంగా వినబడుతోంది. 


Also Read నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్






'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ముందు రెండు సినిమాలతో కంపేర్ చేసినా... ఇప్పటి వరకు మహేష్ బాబు చేసిన సినిమాలు చూసినా సరే... ఎప్పుడూ ఇటువంటి మాస్ క్యారెక్టర్ చేయలేదని అర్థం అవుతోంది. ఆయన్ను అంత మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపిస్తున్నారు.


Also Read పవన్ కళ్యాణ్ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్ - 'నో' రవితేజ సినిమా!


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది. 



వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో ఐదారు సినిమాల మధ్య పోటీ ఉండేలా కనబడుతోంది. జనవరి 12న తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి.