ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni Pan India Movie) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ - ఐదు భాషల్లో సినిమాను తెరకెక్కించనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది.


హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మరో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. బోయపాటికి దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. (Ram - Boyapati Srinu Movie Pooja Commenced Today)


'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయనకు 10వ సినిమా. హీరో రామ్ 20వ చిత్రమిది. 'ది వారియర్' తర్వాత నిర్మాత శ్రీనివాసా చిట్టూరితో రామ్ చేస్తున్న సినిమా కూడా ఇదే.


Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?


సినిమా ప్రారంభమైన సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రామ్ హీరోగా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం మరింత ఆనందంగా ఉంది. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం" అని చెప్పారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.


Also Read: శ్రీకృష్ణుని చరిత్ర, ద్వారకా నగరాన్ని టచ్ చేస్తున్న హీరో నిఖిల్ - 'కార్తికేయ 2' ఫస్ట్ లుక్