మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఓ హిందీ సినిమా చేశారు. ఏప్రిల్ 21న థియేటర్లలో ఆయన సందడి చేయనున్నారు. ఎందుకంటే... ఆ సినిమా విడుదల అయ్యేది ఆ రోజే! అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. రామ్ చరణ్ హిందీ సినిమా చేశారు గానీ... అందులో ఆయనది అతిథి పాత్రే. ఓ పాటలో తళుక్కున మెరుపులా వచ్చి రెండు స్టెప్పులు వేసి వెళ్ళనున్నారు. అదీ సల్మాన్ ఖాన్ హీరో! ఆ సినిమా ఏది? ఆ పాట ఏది? అనే వివరాల్లోకి వెళితే...


సల్మాన్ కోసం...
వెంకీ, పూజతో!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie). ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. కథానాయిక పూజా హెగ్డేకి అన్నయ్యగా ఆయన కనిపిస్తారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి సినిమా రానుంది. ఇందులోనే రామ్ చరణ్ అతిథి పాత్ర చేశారు. 


'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లోని ఓ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డేతో రామ్ చరణ్ స్టెప్పులు వేశారు. ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. చాలా రోజుల క్రితమే ఆ పాటను పిక్చరైజ్ చేశారు. 


సల్మాన్ ఖాన్, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి కోసమే 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ స్పెషల్ రోల్ చేశారు. పతాక సన్నివేశాల్లో చిరు, సల్మాన్ సీన్లు హైలైట్ అయ్యాయి! ఆ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ చేశారు. హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' చేసినప్పుడు ఆయన మద్దతు ఇచ్చారు. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండా మెగాస్టార్ ఇంటికి రాకుండా ఉండరు. ఒకవేళ రావడం కుదరకపోతే కనీసం ఫోనుల్లో అయినా పలకరించుకుంటారు. ఆ అనుబంధం కారణంగా సల్మాన్ సినిమాలోని సాంగులో రామ్ చరణ్ స్పెషల్ రోల్ చేశారు. అదీ సంగతి!


బాలీవుడ్ ఫ్యాన్స్‌కు పండగే!
సల్మాన్, రామ్ చరణ్... వీళ్ళిద్దర్నీ ఓ పాటలో చూడటం బాలీవుడ్ సినిమా లవర్స్, ఫ్యాన్స్‌కు పండగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్... ఈ ముగ్గురూ ఒకరి సినిమాల్లోని పాటల్లో మరొకరు సల్మాన్ మెరిశారు. ఖాన్ హీరోలు కాకుండా రామ్ చరణ్ ఆ అవకాశం అందుకోవడం విశేషమే. 


Also Read : ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఎన్టీఆర్‌గానే పుట్టాలని - అమెరికాలో యంగ్ టైగర్ ఎమోషనల్ స్పీచ్


ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియా రానున్నారు.  వచ్చిన వెంటనే సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగులో జాయిన్ అవుతారు. మార్చి నెలాఖరున రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ మీద సన్నివేశాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకుడు నర్తన్ సినిమా సైతం చర్చల్లో ఉంది. శంకర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత ఆ సినిమా ఉండొచ్చు.  


Also Read 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?