ఒక్కోసారి వివాదానికి కారణమైన చోట ఉండటం వల్ల విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ఏ తప్పూ చేయకపోయినా నలుగురితో తిట్లు తినాల్సి వస్తుంది. 'కెజియఫ్' సినిమాపై (KGF Movie), అందులో హీరో క్యారెక్టరైజేషన్ (Yash Role In KGF) మీద 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) చేసిన కామెంట్స్ అందుకు చక్కటి ఉదాహరణ.


వెంకటేష్ మహాతో పాటు ఆ ఇంటర్వ్యూలో దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ పాలు పంచుకున్నారు. 'కెజియఫ్'పై కామెంట్స్ వెంకటేష్ మహా కామెంట్స్ చేసిన సమయంలో శివ నిర్వాణ మినహా మిగతా ముగ్గురు నవ్వారు. ఆ విధంగా వాళ్ళు స్పందించడం 'కెజియఫ్' ఫ్యాన్స్, కమర్షియల్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రేక్షకుల స్పందన గ్రహించిన ఆ ముగ్గురూ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 


తప్పు జరిగితే క్షమించండి - నందినీ రెడ్డి
''కమర్షియల్ సినిమాలో ఏదో ఒక అంశం, వాళ్ళ కృషి ప్రేక్షకులకు నచ్చడం వల్ల సక్సెస్ అవుతుంది. కమర్షియల్ సినిమా కథనం, గమనం గురించి పాజిటివ్ డిబేట్ తప్ప ఎవరి పనినీ అవహేళన చేయడం మా ఉద్దేశం కాదు. ఏదైనా తప్పు జరిగితే క్షమించండి'' అని నందినీ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ప్రవర్తించిన తీరు, నవ్వడం ప్రేక్షకుడిని అవమానించడమేనని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... ''వెంకటేష్ మహా వివరించిన తీరు, హావభావాలను నవ్వు వచ్చింది. అయితే, అది ఏ కోణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిందనేది అర్థం అయ్యింది. స్పాంటేనియస్ రియాక్షన్ అది. సారీ'' అని ఆమె రిప్లై ఇచ్చారు. 


Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?






ఎవరినీ బాధపెట్టాలని కాదు - వివేక్ ఆత్రేయ
దర్శకుడు వివేక్ ఆత్రేయ సైతం తనకు ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కమర్షియల్ సినిమా గానీ, మిగతా ఏ సినిమా అయినా సరే తన ఆలోచనలకు, పాటించే విలువలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వెంకటేష్ మహా చెప్పిన తీరుకు రియాక్ట్ అయ్యాను తప్ప ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన వివరించారు. ఎవరైనా తన తీరు పట్ల బాధపడితే క్షమించమని ఆయన కోరారు. 






'కెజియఫ్'ను తక్కువ చేసే ఉద్దేశం లేదు! - మోహనకృష్ణ ఇంద్రగంటి
తనకు గానీ, తనతో పాటు ఇంటర్వ్యూలో మిగతా దర్శకులకు గానీ 'కెజియఫ్'ను తక్కువ చేసే ఉద్దేశం లేదని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సినిమాను మెచ్చుకునే, విమర్శించే హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. 'కెజియఫ్'ను వెంకటేష్ మహా విమర్శించిన విధానానికి, ఆయన వాడిన భాషకు తాము రియాక్ట్ అయ్యామని ఆయన తెలిపారు. 'కెజియఫ్' అభిమానులు అందరికీ ఆయనకు క్షమాపణలు చెప్పారు. తామెవరూ కావాలని చేసినది కాదని మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. ఈ ట్రోలింగ్ విషయంలో శివ నిర్వాణ మీద ఎఫెక్ట్ తక్కువ ఉంది. ఆయన సినిమా అనేది వ్యాపారమని చెప్పడం, ఆ విషయంలో డబ్బుల గురించి ఆలోచించాలని వివరించడం చాలా మందికి నచ్చింది. 


Also Read : బాలకృష్ణ - శ్రీ లీల - షూటింగ్ చేసేది ఎప్పుడంటే?