టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుల్లో రాజ్ కోటి ద్వయం ఒకటి. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబో లో వచ్చిన సినిమా అంటే పక్కాగా మ్యూజికల్ హిట్ అనే టాక్ ఉండేది. దీంతో దర్శకనిర్మాతలు రాజ్ కోటి సంగీతం కోసం క్యూలు కట్టేవారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేయడం ప్రారభించారు. అయితే కలసి మంచి మంచి హిట్ సినిమాలకు పనిచేసిన వీరు ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇటీవల సంగీత దర్శకుడు కోటి ఓ య్యూట్యూబ్ చానెళ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ తో ఆయన ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వివరించారు. ఆనాడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారాయన. ప్రస్తుతం కోటి మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఇంటర్వ్యూలో యాంకర్ రాజ్ కోటి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని ప్రశ్న అడిగితే.. వాస్తవానికి రాజ్ తనకీ ఎలాంటి విభేదాలు లేవని. ఇద్దరం కలసే పాటలు చేశామని. తాను పాటలకు కండక్టింగ్ బాగా చేసే వాడని, తాను కంపోజింగ్ చేసేవాడినని అన్నారు. ఏదైనా ఇద్దరం కలసే పనిచేసేవాళ్లమని అన్నారు. ఎలాంటి క్రెడిట్ వచ్చినా అది రాజ్ కోటి కి కలిపి వచ్చేదని అన్నారు. అయితే పని విషయంలో ఒక్కోసారి హీరో, డైరెక్టర్లు తనతో వచ్చి మాట్లాడేవారని అది ఆయనకు నచ్చేది కాదని అన్నారు. అయితే రాజ్ అలాంటి చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోరని, కానీ పక్కన ఉన్నవారి చెప్పుడు మాటలు విని తాను దూరమైపోయాడని అన్నారు. 


నిజానికి రాజ్ కే మొదట సినిమా అవకాశం వచ్చిందని ఆయనే తనతో ఇద్దరం కలసి సినిమాలు చేద్దామని చెప్పారని, అలా తామిద్దరం కలసి ప్రారంభించామని అన్నారు. మళ్లీ తర్వాత తనే వచ్చి మనం విడిపోదాం అని అంటే తాను షాక్ కు గురయ్యానని అన్నారు. తాను ఎంత చెప్పినా వినలేదని, మనల్ని నమ్ముకొని కొన్ని ఆర్కెస్ట్రా ఫ్యామిలీలు ఉన్నాయని అందుకే విడిపోకూడదని బతిమాలినా రాజ్ వినలేదని, విడిపోవాల్సిందేనని పట్టుబట్టాడని చెప్పారు. అప్పటికే కొన్ని సినిమాలు వర్క్ జరుగుతున్నాయని అన్నారు. అందులో చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయని చెప్పారు. రాజ్ స్టూడియోకు రాకపోయినా తాను మాత్రం పని ఆపలేదని అన్నారు. 90 శాతం సినిమాలు తానే పూర్తి చేసి అవి పూర్తయ్యాక స్క్రీన్ మీద రాజ్ కోటి అనే టైటిల్ వేయించానని చెప్పారు. ఆ తర్వాత నుంచీ ఎవరికి వారు సినిమాలు చేసుకున్నామని చెప్పారు. అయితే తాము విడిపోయిన విషయంలో తప్పు ఎవరిదీ కాదని, కాల ప్రభావం వలన అలా జరిగిందని, రాజ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనన్నారు కోటి. ఇక రాజ్ కోటి విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆయన చేసిన సినిమాల్లో ‘సిసింద్రీ’ చెప్పుకోదగినది. కోటి మాత్రం వరుసగా హిట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన పలు సినిమాలకు పనిచేస్తున్నారు. పలు టీవీ షో లలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు కూడా.