Ram Charan: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్... RRR సినిమా త‌ర్వాత ఈయ‌న రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఈయ‌న స్థాయి పెరిగిపోయింది. ఒక‌ప్పుడు న‌ట‌న రాదు అని విమ‌ర్శించిన వారి చేతే గ్లోబ‌ల్ స్టార్ అని అనిపించుకున్నాడు చెర్రీ. మెగాస్టార్ కొడుకుగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. మంచి హిట్ సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడిక రామ్ చ‌ర‌ణ్‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. 


ఇండియ‌న్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM)


రామ్ చ‌ర‌ణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇండియ‌న్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ 15వ ఎడిష‌న్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. అంతేకాకుండా అక్క‌డ అవార్డు కూడా అందుకోనున్నారు. ఇండియ‌న్ ఆర్ట్స్ అండ్ క‌ల్చ‌ర్ అంబాసిడ‌ర్ అవార్డును అందుకోనున్నారు రామ్ చ‌ర‌ణ్. ఇండియ‌న్ సినిమాకి ఆయ‌న చేసిన సేవ‌లకు గాను ఈ అవార్డు అందిస్తున్నారు. ఆ అవార్డు ద‌క్కించుకోనున్న మొద‌టి ఇండియ‌న్ సెల‌బ్రిటీగా ఆయ‌న రికార్డు సృష్టించారు. విక్టోరియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఏటా ఈ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తుంది. ఇక ఈ ఏడాది ఆగ‌స్టు 15 - 25 వ‌ర‌కు ఈ ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంది. 






చాలా సంతోషంగా ఉంది.. 


ఈ విష‌యంపై రామ్ చ‌ర‌ణ్ కూడా స్పందించారు. ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. "భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై ప్ర‌ద‌ర్శించ‌డం, ఇండియ‌న్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ లో పాల్గొన‌డం చాలా గౌర‌వంగా అనిపిస్తుంది. మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించ‌డం, ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను, సినీ ప్ర‌ముఖుల‌ను క‌లుసుకునే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం. RRR సినిమా విశ్వ‌వ్యాప్తం అయ్యింది. అలాంటి గొప్ప అనుభూతిని మెల్ బోర్న్ ప్రేక్ష‌కుల‌తో పంచుకోవ‌డం ఆనందంగా అనిపిస్తుంది. మ‌న జాతీయ జెండాని మెల్ బోర్న్‌లో ఎగ‌రేసే గొప్ప అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని అన్నారు రామ్ చ‌ర‌ణ్. 


ఇక ఈ విష‌యంపై IFFM డైరెక్ట‌ర్ మిటు బౌమిక్ కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. రామ్ చ‌ర‌ణ్ ఈ సారి ఫిలిమ్ ఫెస్టివ‌ల్ కి అతిథిగా రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఫిలిమ్ ఫెస్టివ‌ల్ కి మ‌రింత ప్రాధాన్యత పెరుగుతుంద‌ని అన్నారు. ఆయ‌న‌తో ఈ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ని జ‌రుపుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నారు. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. RRRలో ఆయ‌న నట‌న బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇండియ‌న్ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లింది అని అన్నారు. 


ఈ ఏడాది జ‌రిగే IFFM..15వ ఎడిష‌న్. కాగా.. ఈ ఈవెంట్ కి రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇక ఈ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో మ‌న దేశానికి చెందిన ఎన్నో చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. స‌ద‌ర‌న్ హెమిస్పియ‌ర్ లో జ‌రిగే ఇండియన్ సినిమా అతిపెద్ద వేడుక ఇది. ఈ వేడుక‌లో ప్ర‌ద‌ర్శించే చిత్రాల‌కు అవార్డులు కూడా అందిస్తారు. 


Also Read: సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్న నిహారిక, బన్నీ వాసు- ఎవరు స్టామినా ఏంటో తేలేదీ సాయంత్రం 6 గంటలకే!