Happy Birthday Rajendra Prasad: సీనియర్ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కామెడీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన గొప్ప నటుడాయన. గత నాలుగు దశాబ్దాలకుగా తనదైన హాస్యంతో అందరినీ నవ్విస్తూ 'నవ్వుల రారాజు'గా, 'కామెడీ కింగ్‌'గా, 'హాస్య కిరీటి'గా తెలుగు ప్రేక్షకులను హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కామెడీ హీరోగానే కాకుండా విలక్షణమైన పాత్రలు పోషించి 'నట కిరీటి' అనిపించుకున్నారు. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న రాజేంద్రుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 


* రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. ఆయన 1956 జులై 19న కృష్ణా జిల్లా నిమ్మకూరుకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా చేశారు. వెంటనే ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చినా, మరీ చిన్నపిల్లాడిగా కనిపించడంతో రాజీనామా చేయాల్సి వచ్చిందట.


* నందమూరి తారకరామారావు ఫ్యామిలీతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి మంచి పరిచయం ఉంది. ఇరువురి ఊర్లు సమీపంలోనే ఉండటం వల్ల తరచుగా ఎన్టీఆర్‌ను కలుస్తూ ఉండేవారట. అలా చిన్నప్పటి నుంచే ఎన్టీ రామారావుని చూస్తూ పెరిగిన ప్రసాద్.. ఆయన ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 


* ఎన్టీఆర్ నటించిన 'తాతమ్మ కల' షూటింగ్ చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి రావాలని అనుకున్నారట. రామారావు, త్రివిక్రమరావు సలహా మేరకు చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఎలాంటి సినీ కష్టాలు పడకుండానే శిక్షణ తీసుకున్న వెంటనే సినిమా అవకాశాలు అందుకున్నారట. 


* 1977లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'స్నేహం' సినిమాతో రాజేంద్ర ప్రసాద్ తెరంగేట్రం చేశారు. అంతకముందు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అలానే కొన్ని సినిమాల్లో గుర్తింపు లేని సహాయక పాత్రలు పోషించారు.  


 * వంశీ దర్శకత్వంలో నటించిన 'ప్రేమించు పెళ్లాడు' సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్. 'కాష్మోరా' లాంటి సీరియస్ సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'లేడీస్ టైలర్‌' వంటి కామెడీ చిత్రంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయినా సరే ఓవైపు ప్రధాన పాత్రలు పోషిస్తూనే, మరోవైపు సపోర్టింగ్ రోల్స్‌లో కంటిన్యూ అయ్యారు. మల్టీస్టారర్ మూవీస్ లోనూ నటించారు. 


* రాజేంద్ర ప్రసాద్ లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీయడంలో దర్శకులు జంధ్యాల, వంశీ ముఖ్య భూమిక పోషించారు. రేలంగి నరసింహా రావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులు ఆ కామెడీని ఉపయోగించుకొని ఎన్ని విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు.


* అహ నా పెళ్లంట, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, మాయలోడు, అప్పుల అప్పారావు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెళ్లి పుస్తకం, గోల్‌ మాల్ గోవిందం, మిస్టర్ పెళ్లాం, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ లాంటి సినిమాలు రాజేంద్ర ప్రసాద్ ను తిరుగులేని కామెడీ హీరోగా నిలబెట్టాయి. 


* ఎర్రమందారం, కాష్మోరా, నవయుగం, ముత్యమంత ముద్దు, ఉదయం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలు రాజేంద్ర ప్రసాద్ లోని మరో కోణాన్ని పరిచయం చేశాయి.  'మేడమ్' 'వివాహ బోజనంబు' 'ఆల్ రౌండర్' లాంటి చిత్రాలలో లేడీ గెటప్స్ వేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. 


* రాజేంద్రప్రసాద్ తెలుగుతోపాటుగా తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. 2009లో 'క్విక్ గన్ మురుగన్' అనే ఓ హాలీవుడ్ మూవీ కూడా చేశారు. ఇందులో ఇండియన్ కౌబాయ్ పాత్రలో ఒక డిఫరెంట్ కామెడీ హీరో రోల్‌ పోషించారు. ఆ సమయంలో జరిగిన IIFA ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రీన్ కార్పెట్‌పై నడిచారు. 


* 'ఎర్రమందారం', 'ఆ నలుగురు'  సినిమాలలో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నారు రాజేంద్రప్రసాద్. 


* శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాయ్స్' సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో తమిళ నటుడు వివేక్‌ కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. అలాగే కమల్ హాసన్ నటించిన 'తెనాలి' చిత్రంలో జయరామ్‌ కు వాయిస్ అందించారు. 


* సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా సహాయ పాత్రలే చేస్తూ వచ్చిన రాజేంద్రప్రసాద్.. సేనాపతి, డ్రీమ్, గాలి సంపత్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. అలానే 'సరిలేరు నీకెవ్వరు' 'ఎఫ్ 3' లాంటి చిత్రాల్లో హీరోతో పాటుగా సినిమా అంతా ఉండే పాత్రల్లో నటించారు. ఇటీవల 'కల్కి 2898 AD' మూవీలో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం 'రాబిన్ వుడ్' 'జనక అయితే గనక' 'లగ్గం' 'షష్ఠి పూర్తి' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 


Also Read: అనంత్ అంబానీ పెళ్ళిలో మెగా కపుల్ - ముఖేష్ అంబానీకి అభివాదం చేస్తున్న రామ్ చరణ్ ఫోటో వైరల్