Rajinikanth’s Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదిరిపోయే స్టైయిల్ తో, స్పెషల్ మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను శాసించగల వన్ అండ్ ఓన్లీ స్టార్ ఆయన. 73 ఏళ్ళ వయసులోనూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక్క తమిళ్ లోనే కాదు మిగతా అన్ని భాషల్లోనూ తలైవర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్నో మూవీస్ మన దగ్గర కూడా మంచి విజయాలు సాధిస్తుంటాయి. అయితే ఇప్పుడు రజనీ నటించిన సినిమాకి జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్'. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అప్పుడెప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈరోజు శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమాకి ఇప్పుడు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రేక్షకులు లేక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఉదయం ఆటలు రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. 


ముంబై బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం 'లాల్ సలామ్'. ఇందులో మెయినుద్దీన్ భాయ్ అనే పవర్‌ ఫుల్ పాత్రలో నటించారు రజనీ కాంత్. కాకపోతే ఇది ఫుల్ లెంత్ రోల్ కాదు.. స్పెషల్ క్యామియో. అయినప్పటికీ 'జైలర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తలైవర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో, అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే ఎందుకనో ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తున్న కొద్దీ సినిమాపై బజ్ తగ్గుతూ వచ్చింది. తమిళ్ లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం ఏమాత్రం బజ్ లేకుండాపోయింది. దీనికి తగ్గట్టుగానే రిలీజ్ రోజు బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయి. దీంతో కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేసారట. టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.


నిజానికి 'లాల్ సలాం' టీమ్ తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. అలాంటి సినిమా ఒకటి రిలీజ్ అవుతుందనే విషయమే చాలామందికి తెలియలేదు. దీనికి తోడు మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' సినిమా కూడా ఈరోజే విడుదలయ్యింది. దీనిపై తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. అందుకే జనాలు తలైవర్ ప్రత్యేక పాత్రలో నటించిన డబ్బింగ్ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. కాకపోతే మౌత్ టాక్ బాగుంటే ఈవెనింగ్ షోల నుంచి ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా రజనీకాంత్ లాంటి స్టార్ ఉన్నా కూడా ఈ చిత్రాని ఇలాంటి స్పందన రావడం షాకింగ్ అనే చెప్పాలి.


'లాల్ సలాం' సినిమాలో రజనీకాంత్ తో పాటుగా క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు.



Also Read: ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ - ఆ రోజు ఏం జరిగింది? ఆ థ్రిల్లర్ మూవీకి ప్రీక్వెల్ వ‌చ్చేస్తోంది!