Guntur Kaaram OTT: సంక్రాంతి రేసులో ఎంతో హైప్‌తో విడుదలయిన సినిమా ‘గుంటూరు కారం’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ కావడంతో.. దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో విడుదలయిన తర్వాత ‘గుంటూరు కారం’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఒకే తరహాలో సినిమాలు తీస్తున్నారని విమర్శలు వచ్చాయి. అయినా కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది ‘గుంటూరు కారం’. ఇప్పుడు ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది ఈ సినిమా.


రౌడీ రమణ వచ్చేస్తున్నాడు..


థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ‘గుంటూరు కారం’.. నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే ఈ మూవీ థియేటర్లలో ఆకట్టుకోగలిగింది. ఇక ఓటీటీలో కూడా విడుదల అవ్వడంతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుంటూరు కారం’ ఫిబ్రవరీ 8 అర్థరాత్రి నుండే స్ట్రీమింగ్ ప్రారంభమయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి చెప్పడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఒక స్పెషల్ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. ఇప్పటికే రౌడీ రమణ వచ్చేస్తున్నాడు అని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్.. మరోసారి రౌడీ రమణ గురించి స్పెషల్‌గా చెప్పుకొచ్చింది.


నెలరోజుల లోపే..


‘రాయల్ సత్యంలాగా బ్లాక్ అండ్ వైట్ కాదు.. రౌడీ రమణలాగా సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్’ అంటూ రౌడీ రమణ గురించి స్పెషల్‌గా చెప్పుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. అంతే కాకుండా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించింది. జనవరి 12న థియేటర్లలో విడుదలయిన ఈ మూవీ.. నెలరోజుల లోపే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది కాబట్టే ఇంత త్వరగా స్ట్రీమింగ్ ప్రారంభించుకుందని లేకపోతే ఇంకా కొన్నిరోజుల ఆగిన తర్వాతే ఓటీటీలోకి వచ్చేదని మహేశ్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఫైనల్‌గా ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దీనిని ఓటీటీలో కూడా ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు.






ఇద్దరు హీరోయిన్లు..


‘గుంటూరు కారం’లో అన్నింటికంటే హైలెట్‌గా నిలిచింది సూపర్ స్టార్ మహేశ్ బాబు డ్యాన్సే. ఎన్నో ఏళ్లుగా స్క్రీన్‌పై మహేశ్ ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయలేదని అభిమానులు తెగ సంతోషించారు. ఇప్పటికే టాలీవుడ్‌లో డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ఇక స్క్రీన్‌పై మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్సులకు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు వచ్చేశాయని అభిమానులు చెప్పుకున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ మరో హీరోయిన్‌గా నటించింది. మామూలుగా త్రివిక్రమ్ ఇతర సినిమాల్లోని సెకండ్ హీరోయిన్‌గా ‘గుంటూరు కారం’లో మీనాక్షి చౌదరీ పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. వీరితో పాటు మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలాంటి సీరియర్ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.


Also Read: ఆ ప్రచారంపై ‘ఈగల్’ నిర్మాత ఫైర్ - అది నా సొంత నిర్ణయమంటూ క్లారిటీ