Eagle Movie Producer TG Vishwa Prasad: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రమే ‘ఈగల్’. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్.. నిర్మాతగా వ్యవహరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ఈ మూవీ నిర్మాణం జరిగింది. సంక్రాంతి రేసులోనే ‘ఈగల్’ నిలబడాల్సింది. కానీ అందరు నిర్మాతలు కలిసి తీసుకున్న నిర్ణయానికి లోబడి రవితేజ సొంతంగా ‘ఈగల్’తో పక్కకి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరీ 9న ఈ సినిమా ప్రేక్షలకు ముందుకు వస్తుందని ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన నిర్మాణ సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి విశ్వప్రసాద్ బయటపెట్టగా.. దానిపై ప్రచారాలు మొదలయ్యాయి. దీనిపై నిర్మాత స్పందించారు.
భుజాలు తడుముకుంటున్నారు..
‘ఈగల్’ ప్రమోషన్స్ సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి చర్యల గురించి టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలను మార్చి రకరకాలుగా ప్రచారాలు మొదలయ్యాయి. వాటిపై క్లారిటీ ఇవ్వడానికి ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘‘నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అని మీడియా వారికి చెప్పడం జరిగింది’’ అంటూ ‘ఈగల్’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడిన మాటల గురించి టీజీ విశ్వప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అది ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి అనకపోయినా.. కొందరు బయట వ్యక్తులు మాత్రం భుజాలు తడుముకుంటున్నారని ఆయన అన్నారు.
వారికి సంబంధమేంటి..?
కేవలం అవినీతి చర్యల గురించి చెప్పడం మాత్రమే ఆయన ఉద్దేశ్యం అని, కానీ కొందరు బయట వ్యక్తులు కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని టీజీ విశ్వప్రసాద్ బయటపెట్టారు. ‘పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను.. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకు అర్ధం కాలేదు’’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నవారిపై సీరియస్ అయ్యారు. తమ ప్రొడక్షన్ హౌజ్‌లో ఎవరికైనా జీతాలు అందకపోతే.. నేరుగా మాట్లాడుకుంటున్నారని, ఒకవేళ యూనియన్‌కు కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడే పరిష్కరించుకుంటామని తెలిపారు.
వారికి మాత్రమే వ్యతిరేకం..
‘‘ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు’’ అంటూ అవినీతికి పాల్పడిన వారిపై కూడా యాక్షన్ తీసుకోనని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. అలా యాక్షన్ తీసుకోకూడదు అనుకోవడం తన సొంత నిర్ణయం అని చెప్పుకొచ్చారు. దీంతో బయటవారికి సంబంధం లేదన్నారు. ‘‘వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే నేను వ్యతిరేకం. నేనెప్పుడూ ఏ అవినీతికి పాల్పడుతున్న వ్యక్తికి కూడా తలవంచను. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. వ్యక్తి కంటే సినిమా చాలా గొప్పది’’ అని తన ట్వీట్‌లో వివరించారు టీజీ విశ్వప్రసాద్.
Also Read: రవితేజ 'ఈగల్' సినిమాకు సీక్వెల్ - టైటిల్ కూడా ఫిక్స్!