Vyooham Movie Release Date: ప్రస్తుతం ఏపీ పొలిటిక్స్‌లో ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో విడుదలవుతున్న సినిమాలు కూడా ఈ కాంట్రవర్సీల హీట్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఇప్పటికే ‘యాత్ర 2’ రిలీజ్, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీ రిలీజ్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పొలిటిక్ హీట్.. సినిమాల వరకు చేరుకుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసుకుందని ఒక హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడు ఆర్జీవీ. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ఏపీ రాజకీయ నాయకులను ట్యాగ్ కూడా చేశాడు వర్మ.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరిగాయని చెప్తూ.. ‘వ్యూహం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం కాబట్టి ఈ సినిమా విడుదల అయితే ఓటర్లపై ప్రభావం పడుతుందని హైకోర్టు కూడా దీనిని నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఫైనల్‌గా తన మాట నెగ్గేలా చేసుకొని ‘వ్యూహం’ను విడుదలకు సిద్ధం చేశాడు వర్మ. ఫిబ్రవరీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల ఉండగా.. అందులో ఇప్పుడు ‘వ్యూహం’ కూడా యాడ్ అయ్యింది. ఫిబ్రవరీ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీంతో వర్మ.. పార్టీ చేసుకున్నాడు.


మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం..


‘‘నేను, మాసూం శంకర్ ఫిబ్రవరీ 23న వ్యూహం రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అంటూ మసూం శంకర్ అనే తమిళ హీరోయిన్‌తో పార్టీ చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు ఆర్జీవీ. ‘‘మా వ్యూహం టీడీపీని తాగడానికి, జనసేన పార్టీని తినడానికి వచ్చేస్తోంది’’ అంటూ క్యాప్షన్స్‌తోనే ఏపీలోని పొలిటికల్ పార్టీలను టార్గెట్ చేశాడు. ఈ క్యాప్షన్స్, ఫోటోలు చూస్తూ.. రామ్ గోపాల్ వర్మ లైఫ్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు ఏది పట్టించుకోకుండా, ఎవరికీ భయపడకుండా ఆర్జీవీ అలా ఎలా లైఫ్‌ను లీడ్ చేసేస్తాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వ్యూహం’లాంటి పొలిటికల్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించినా.. ఎవరికీ భయపడకుండా పార్టీ చేసుకుంటున్నాడని ఆర్జీవీ ధైర్యం గురించి చర్చిస్తున్నారు.






ఫైనల్‌గా సాధించాడు..


ఫిబ్రవరీ 23న విడుదల కానున్న ‘వ్యూహం’లో అజ్మల్ అమీర్.. వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది. ధనుంజయ్ ప్రభూన్, సురభి ప్రభావతి, రేఖ సురేఖ, వాసు ఇంటూరి, కోటా జయరాం వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 2024 ఎలక్షన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిందని ప్రేక్షకులకు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులకు కూడా తెలిసినా.. దీని ఆపే ప్రయత్నంలో ఇప్పటికే నారా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలన్న ఆర్జీవీ ప్రయత్నం ఫైనల్‌గా నెరవేరబోతుంది.


Also Read: బాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌తో చరణ్‌ పాన్‌ ఇండియా మూవీ! - కథ ఏంటో తెలుసా?