A Quiet Place: Day One Trailer: ‘ఏ క్వైట్ ప్లేస్’. 2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.

   సైన్స్ ఫిక్షన్, హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజిలో థ్రిల్ ను పంచింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చున్నారంటే, ఏ స్థాయిలో ఆకట్టుకుంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా 2020లో ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్‌ 2’ పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మూడేళ్లకు ప్రీక్వెల్ గా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ పేరుతో సినిమా అభిమానులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.


వింత జీవులు భూమ్మీదకు ఎలా వచ్చాయి?


‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు పార్టులను తలదన్నేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. కళ్లు చెదిరే విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ను గమనిస్తే, స్పేస్ నుంచి కొన్ని జీవులు భూమి మీదికి వస్తాయి. భూగోళాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. చిన్న శబ్దం వినపడినా పసిగట్టి.. మనుషులను మట్టుబెడతాయి. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా ఉండటం ఒక్కటే మార్గం. ఈ భయంకర జీవుల దాడి నుంచి ఓ కుటుంబం ఎలా భయటపడింది? అనేది ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో చూపించారు మేకర్స్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూడో భాగం ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’లో అసలు ఈ వింత జీవులు భూగ్రహం మీదికి ఎలా వచ్చాయి? అవి భూమ్మీద అడుగు పెట్టిన తొలి రోజు ఏం జరిగింది? నగరాల మీద పడి ఎలా దాడి చేశాయి? అనేది చూపించబోతున్నారు. ప్రేక్షకులను సైలెంట్‌గా భయపెట్టేందుకు వచ్చేస్తోంది. 



జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’


ఇక ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు జాన్ క్రాసిన్స్కి దర్శకత్వం వహించారు. ఆయన భార్య, హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎమిలీ బ్లంట్ తో కలిసి నటించారు. మూడో భాగం ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాల్లోని నటీనటులతో పాటు  లుపిటా న్యోంగో, జోసెఫ్ క్విన్, అలెక్స్ వోల్ఫ్ ఈ చిత్రంలో భాగం అవుతున్నారు. పారామౌంట్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరగా ఈ ఏడాది జూన్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.


Read Also: మోడీగా మారిన ‘రాముడు’ - ‘ఆర్టికల్ 370’లో ప్రధానిగా రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ సర్‌ప్రైజ్