సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా తెరకెక్కిన తాజా సినిమా 'వేట్టైయాన్' (Vettaiyan Movie). ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్ర చేశారు. ఆయన పాత్రకు చెప్పించిన డబ్బింగ్ విమర్శలకు కారణం అయ్యింది. బహుశా... ఆ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారో? ఏమో? తెలుగుకు వచ్చే సరికి కరెక్షన్స్ చేశారు.
సారీ ప్రకాష్ రాజ్ గారూ... మీ వాయిస్ లేదు!
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) క్యారెక్టర్ చెప్పే డైలాగుతో 'వేట్టైయాన్' తమిళ ప్రివ్యూ మొదలు అయ్యింది. అయితే... స్క్రీన్ మీద ఆయన ఫేస్ చూసి అక్కడి ఆడియన్స్ మాత్రమే కాదు, యావత్ భారతీయ ప్రేక్షకులు షాక్ అయ్యారు. అందుకు కారణం ఆయన ముఖానికి, వచ్చే మాటకు సంబంధం లేకపోవడమే.
'వేట్టైయాన్' తమిళ ప్రివ్యూలో అమితాబ్ బచ్చన్ పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పారు. అందువల్ల, ప్రివ్యూ మొదలైనప్పుడు ఆయన మాటలు విని, ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర చేశారని ఆడియన్స్ భావించారు. కానీ... స్క్రీన్ మీద అమితాబ్ ఫేస్, స్క్రీన్ వెనుక ప్రకాష్ రాజ్ డబ్బింగ్ అసలు సింక్ కాలేదు. అందుకని, అందరూ షాక్ తిన్నారు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రకాష్ రాజ్ పాపులర్ ఆర్టిస్ట్. ఏ భాషలో సినిమా చేసినా సరే... డబ్బింగ్ చెప్పుకోవడం ఆయనకు అలవాటు. ఆ విలక్షణమైన గొంతు ఆడియన్స్ అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ గొంతు కూడా జనాలకు తెలుసు. దాంతో విమర్శలు వచ్చాయి. ఆ ఫీడ్ బ్యాక్ 'వేట్టైయాన్' ఫిల్మ్ మేకర్స్ దృష్టికి వెళ్లింది. తెలుగుకు వచ్చేసరికి ప్రకాష్ రాజ్ డబ్బింగ్ తీసేసి మరొకరితో డబ్బింగ్ చెప్పించారు.
ఇప్పుడు తమిళంలోనూ డబ్బింగ్ మార్చే ఆలోచన!
ప్రివ్యూ వరకు ప్రకాష్ రాజ్ వాయిస్ ఉన్నప్పటికీ... సినిమాలో అమితాబ్ పాత్రకు ఆ వాయిస్ ఉండదని సమాచారం అందుతోంది. ఏఐ సాయంతో మార్చే ఆలోచన చేస్తున్నారట. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో అమితాబ్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డైలాగులు చెప్పించి, ఆ తర్వాత ఏఐ సాయంతో గొంతును మార్చారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ టెక్నాలజీ సాయంతో అమితాబ్ పాత్రకు సినిమాలో కొత్త గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతోంది.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే
'వేట్టైయాన్'లో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా రజనీకాంత్!
Rajinikanth role in Vettaiyan: 'వేట్టైయాన్' సినిమాలో ఎటువంటి భయం లేకుండా నేరస్తులను ఎన్కౌంటర్ చేసే స్పెషలిస్టు పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. 'మనకు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు' అని రజనీ పాత్రను ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ రాశారు. వేట్టైయాన్ పేరు చెబితేనే రౌడీలు హడలిపోతుంటారు. రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వారిని వేటాడే అధికారిగా హీరోని చూపించారు.
'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల అవుతుంది. ఇందులో 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, 'రాయన్' ఫేమ్ దుసారా విజయన్, ప్రతినాయకుడిగా రానా దగ్గుబాటి, అభిరామి, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు.