యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా 'అరవింద సమేత వీరరాఘవ'. ఆ సినిమాలో 'రారా పెనిమిటి...' (Raa Raa Penimiti) సాంగ్ ఎమోషనల్ హిట్! ఇప్పటికీ ఆ పాట ఎక్కడో ఒక చోట వినబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ హుక్ లైన్ టైటిల్ గా ఓ సినిమా రూపొందింది. 


రారా పెనిమిటి... 
నందితా శ్వేత ఒక్కరే!
భ‌ర్త రాక కోసం ఓ భార్య ప‌డే విర‌హ వేదన నేప‌థ్యంలో రూపొందిన సినిమా 'రారా పెనిమిటి' (Raa Raa Penimiti Movie). ఇందులో నందితా శ్వేత నటించారు. ఆమె ఒక్కరే సినిమా అంతా కనబడతారు. సినిమాలో ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఉంది. ఈ ప్రయోగాత్మక చిత్రానికి స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ పతాకంపై శ్రీమ‌తి ప్ర‌మీల గెద్దాడ నిర్మించారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ. త్వరలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. 


మణిశర్మ సంగీతంలో...
'రారా పెనిమిటి' సినిమాకు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ ''మంచి క‌థ‌తో దర్శకుడు స‌త్య వెంక‌ట గెద్దాడ ఆ దగ్గరకు వచ్చారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించారు. నాకు ఇష్టమైన పాటలు సినిమాలో ఉన్నాయి. నీల‌కంఠ రావు చ‌క్క‌టి సాహిత్యం రాశారు. నందితా శ్వేత అద్భుతంగా న‌టించింది'' అని చెప్పారు. 


కథ విన్నప్పుడు భయపడ్డాను! - నందిత
దర్శకుడు 'రారా పెనిమిటి' కథ వివరించినప్పుడు తాను భయపడినట్లు హీరోయిన్ నందితా శ్వేతా తెలిపారు. సింగిల్ క్యారెక్టర్ అంటే చేయగలనా? లేదా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించానని తెలిపారు. ఇటువంటి క్యారెక్టర్ చేసే అవకాశం ఎప్పుడూ వస్తుందని అనుకోలేదని, దర్శకుడు చెప్పింది చేశానని ఆమె తెలిపారు. ఈ సినిమాలో ఓ పాటకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని, ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు. 


సినిమా కథ ఏంటంటే? 
'రారా పెనిమిటి' సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. కొత్త‌గా పెళ్లైన అమ్మాయి త‌న భ‌ర్త రాక కోసం వేచి చూస్తూ ప‌డే విర‌హ వేద‌నే ఈ సినిమా అని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుందని, చాలా మందిని చూసిన తర్వాత నందితా శ్వేతాను ఎంపిక చేశామని దర్శకుడు సత్య తెలిపారు. స్క్రీన్ మీద నందితా శ్వేత మాత్రమే కనిపించినప్పటికీ... ఫోనులో ఇతరులతో మాట్లాడే సన్నివేశాలు ఉన్నాయని, ఆయా పాత్రలకు బ్రహ్మానందం, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సునీల్, స‌ప్త‌గిరి, హేమ‌, అన్న‌పూర్ణమ్మ డబ్బింగ్ చెప్పారని వివరించారు.


Also Read 'కెజియఫ్' దర్శకుడి కథకు దీపికా పదుకోన్ ఓకే అంటుందా?


ఈ కార్యక్రమంలో పాట‌ల ర‌చ‌యిత డా. డి నీల‌కంఠ‌ రావు, గాయని హ‌రిణి ఇవ‌టూరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం : డా. డి నీల‌కంఠ‌ రావు, ఛాయాగ్రహణం : రామ్ కుమార్, సంగీతం : మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత : శ్రీమ‌తి ప్ర‌మీల గెద్దాడ‌, ర‌చ‌న‌, దర్శ‌క‌త్వం : స‌త్య వెంక‌ట గెద్దాడ‌.


Also Read మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?