Priyanka Chopra Mother Madhu Chopra: బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి హాలీవుడ్ వరకు ఎదిగింది ప్రియాంక చోప్రా. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రియాంక హీరోయిన్‌గా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిందే ఒక సౌత్ సినిమాతోనే. అది కూడా విజయ్ హీరోగా నటించిన సినిమాతో. 2000లో మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత ముందుగా కోలీవుడ్.. తనను హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యింది. అలా తనకు విజయ్ హీరోగా నటించిన ‘తమిరన్’లో ఛాన్స్ వచ్చింది. తాజాగా ‘తమిరన్’ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది.


నేనే చెప్పా..


ప్రియాంక మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత  ‘తమిరన్’లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎలా వచ్చింది, అసలు దానికి ఎలా ఒప్పుకుంది అనే విషయాన్ని ఆమె తల్లి మధు చోప్రా తాజాగా బయటపెట్టారు. ‘‘ప్రియాంకకు అసలు సినిమాల్లో కనిపించడం ఇష్టం లేదు. ఎవరి ద్వారానో తనకు సౌత్ సినిమాలో అవకాశం వచ్చింది. నేను తనకు ఈ ఆఫర్ గురించి చెప్పినప్పుడు తను ఏడ్చేసింది. నేను అస్సలు సినిమాలు చేయను అని చెప్పింది. తను ఎప్పుడూ చెప్పిన మాట వినే కూతురులాగానే నడుచుకుంది. అందుకే నేను తనకు ఆఫర్ ఒప్పుకోమని చెప్పగానే సరే అని కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టింది’’ అని గుర్తుచేసుకున్నారు మధు చోప్రా.


రోజంతా ప్రాక్టీస్..


హీరోయిన్‌గా నటించడం ఇష్టమే లేని ప్రియాంక చోప్రా.. ‘తమిరన్’లో నటించడానికి ఎంత కష్టపడ్డారో కూడా మధు చోప్రా చెప్పుకొచ్చారు. ‘‘సినిమా షూటింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత తనకు ఆ వాతావరణం నచ్చింది. తనకు భాష తెలియకపోయినా ఎంజాయ్ చేసింది. టీమ్ అంతా తనకు చాలా సాయం చేస్తూ గౌరవంతో చూసుకున్నారు. విజయ్ ఒక పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. ఒక పాటకు రాజ సుందరం కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్స్‌లో ప్రియాంక పరవాలేదనిపించినా ముందుగా విజయ్‌తో తను స్టెప్స్ మ్యాచ్ చేయలేకపోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కొరియోగ్రాఫర్‌తో ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. అదే క్రమంలో తను ఇదంతా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే తనకు ఇది కెరీర్‌లాగా ఎంచుకోవాలి అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు మధు చోప్రా.


హాలీవుడ్‌లో సెటిల్..


‘తమిరన్’తో హీరోయిన్‌గా మారిన ప్రియాంక చోప్రా.. ‘ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’ అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కొన్నాళ్ల పాటు తన కెరీర్ మామూలుగా సాగినా.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆమె కూడా పెద్ద స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత హాలీవుడ్ నుండి అవకాశాలు దక్కించుకొని గ్లోబల్ స్టార్‌గా మారింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది ప్రియాంక. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌కు దూరమయ్యి హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతిలో ‘ది బ్లఫ్’, ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే రెండో ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి.


Also Read: బాలీవుడ్ ఖాన్స్‌ను వెనక్కి నెట్టిన దీపికా పదుకొనె - ఆ విషయంలో ఆమే ఫస్ట్!