Kajal Aggarwal Satyabhama Press Meet: 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. 'మేజర్' చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైం థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నేడు మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కాజల్, డైరెక్టర్, నిర్మాతలు పాల్గొన్ని మూవీ విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ.. " ఈ సినిమాతో నా కెరీర్‌లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. నేను ఇలాంటి కథలోనే, క్యారెక్టర్సే చేయాలని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను. 'సత్యభామ' కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి.
ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. "సత్యభామ" నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 'సత్యభామ' ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా" అన్నారు.
దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ .. "సత్యభామ" కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం ఒక యూనిఫామ్ వేసుకుని యాక్షన్ చేయడం కాదు కాజల్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంటుంది. ఒక కేసు విషయంలో తను పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. యాక్షన్, ఎమోషన్ రెండు చేయగలదు కాబట్టే కాజల్ ను ఎంచుకున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఒక స్పెషల్ కేసు ఉంటుంది వాళ్లు హ్యాండిల్ చేసింది. ఈ సినిమాలో కాజల్ కూడా ఒక కేసును పర్సనల్ గా తీసుకుంటుంది. ఆ కేసు విషయంలో ఎమోషనల్ అవుతుంది. ఆ కేసులో జస్టిస్ చేయగలిగిందా లేదా అనేది "సత్యభామ" కథ అన్నారు.