Prasanth Varma about Maha Bharat: ప్రతీ దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అలాగే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కూడా ఉంది. ప్రస్తుతం తను తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ సక్సెస్‌లో మునిగిపోయిన ప్రశాంత్.. ఇంకా తన ప్రమోషన్స్‌లో ఆపలేదు. ఈ మూవీ విడుదలకు ముందు కూడా ప్రతీ రాష్ట్రానికి తిరుగుతూ.. ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అదే సందర్భంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయాన్ని బయటపెట్టాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశానని, దానికి కారణం రాజమౌళి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజువల్ వండర్‌గా ‘హనుమాన్’..
దేవుడి క్యారెక్టర్‌తో ఒక సూపర్ హీరో సినిమా చేయవచ్చని, అలా ఎన్నో దేవుళ్ల పాత్రలతో ఒక సినిమాటిక్ యూనివర్స్‌నే సృష్టించవచ్చని ఒక విభిన్నమైన ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రశాంత్ వర్మ. అలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీసీయూ) అనేదాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుండి ముందుగా విడుదలయిన చిత్రమే ‘హనుమాన్’. లిమిటెడ్ బడ్జెట్‌తో, యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను మతిపోగొట్టింది. ముఖ్యంగా ఇదొక విజువల్ వండర్ అని ప్రశాంత్ కష్టాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అప్పటివరకు ప్రశాంత్ వర్మ.. ప్రమోషన్స్‌లో చెప్పిన చాలా విషయాలను ట్రోల్ చేసిన నెటిజన్లు.. సినిమా చూసిన తర్వాత తనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక భారత ఇతిహాసాల్లో ఒకటైన ‘మహాభారతం’ గురించి ప్రశాంత్ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.
కెరీర్ మొదట్లో ఆలోచన ఉండేది..
‘హనుమాన్’ విడుదలకు ముందు ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు హనుమంతుడిపై సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తను.. మహాభారతంపై ఎందుకు సినిమా చేయాలనుకోలేదు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి ప్రశాంత్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘నా కెరీర్ మొదట్లో నాకు మహాభారతంపై ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. కానీ రాజమౌళి గారు దానిపై సినిమాను చేస్తానని అనౌన్స్ చేయగానే నేను ఆ ఆలోచనను పక్కన పెట్టేశాను’’ అని అన్నాడు. ఇక రాజమౌళి కూడా ఎప్పటికైనా మహాభారతంపై సినిమా చేస్తానని చెప్పి చాలాకాలమే అయ్యింది.
రిటైర్ అయ్యేలోపు..
తెలుగు సినిమాల్లో ఎపిక్ విజువల్స్‌ను అందించి.. సినిమాను ప్రపంచవ్యాప్తంగా హిట్ చేయగలడు అని పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న మూవీపైనే ఉంది. అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. కానీ తను రిటైర్ అయ్యేలోపు కచ్చితంగా మహాభారతంపై సినిమాను తెరకెక్కిస్తానని చాలాకాలమే క్రితమే ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. ఆ మూవీని తెరకెక్కించాలంటే చాలా ప్లానింగ్ ఉండాలని రాజమౌళి అన్నారు. ఇప్పటికే మహాభారతం తెరకెక్కించాలని తనకు ఒక ఐడియా ఉందని, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండానే ఆ మహాకావ్యాన్ని తెరకెక్కిస్తానని పలు సందర్భాల్లో బయటపెట్టారు రాజమౌళి.
Also Read: ‘గుంటూరు కారం’ ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎక్కడంటే?