Actress Lathasri About Her Mother Treatment: లతా శ్రీ.. సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత నటనా రంగానికి దూరం అయ్యింది. నాగ శౌర్యకు మేనత్త అయిన లతాశ్రీ అసలు పేరు పద్మలత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను వెల్లడించింది.
అందరి ముందు తిట్టడంతో అటు వైపు చూడలేదు!
తెలుగు, కన్నడలో సినిమాలు చేసినా, మలయాళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్ద కారణం ఉందని లతాశ్రీ వెల్లడించింది. “హీరోయిన్ గా తొలిసారి తెలుగులో ‘మన్మథ సామ్రాజ్యం’ అనే సినిమాలో నటించాను. కన్నడ నుంచి చాలా ఆఫర్లు వచ్చేవి. కానీ, మా అమ్మ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయాలని చెప్పేది. తొలుత హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. ఒకానొక సమయంలో మలయాళంలో మమ్ముట్టితో సినిమా చేసే అవకాశం దక్కింది. దర్శకుడు నా నటన బాలేదంటూ వంకలు పెట్టాడు. సెట్స్ లో అందరు చూస్తుండగానే తిట్టాడు. చాలా బాధ కలిగింది. అక్కడే ఏడ్చాను. ఆ సినిమాను వదిలేసి వచ్చేశాను. మళ్లీ మలయాళీ సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూడలేదు” అని చెప్పుకొచ్చింది.
జిమ్ కు వెళ్లి ప్రేమలో పడ్డా!
తనకు చిన్నప్పటి నుంచి జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది లతాశ్రీ. రోజూ జిమ్ కు వెళ్లే తాను, జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్ల చెప్పింది. “ప్రతి రోజు ఉదయాన్ని జిమ్ కు వెళ్లేదాన్ని. కొద్ది రోజుల తర్వాత జిమ్ ట్రైనర్ నన్ను లవ్ చేస్తున్నట్లు చెప్పాడు. నేనూ ఓకే చెప్పాను. ఏడాది పాటు లవ్ లో ఉన్నాం. ఆ సమయంలో సినిమా అవకాశాలు వచ్చినా చేయలేదు. అమ్మకు అసలు విషయం తెలిసి చాలా కోప్పడింది. అబ్బాయి వాళ్ల నాన్న డిప్యూటీ కలెక్టర్. మా పెళ్లికి మా అమ్మతో పాటు అబ్బాయి తండ్రి ఒప్పుకోలేదు. ఇక్కడ ఉంచకుండా నన్ను అమ్మ ఢిల్లీకి పంపించింది. కానీ, చివరకు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం” అని వెల్లడించింది.
డబ్బుకోసం అమ్మను చంపేశారు!
డబ్బుకోసం కొందరు ఎంతైనా దిగజారుతారని లతాశ్రీ వెల్లడించింది. డబ్బు ఆశతో డాక్టర్లు తన తల్లిని చంపేశారని వెల్లడించింది. “పెళ్లి తర్వాత అమ్మ మాతోనే ఉండేది. ఓ రోజు విజయవాడకు వెళ్లింది. అక్కడ గుండెపోటు వచ్చింది. అక్కడ మేం ఎవరం లేము. రాత్రంతా నొప్పి భరించింది. ఎంతకీ తగ్గకపోవడంతో అన్నయ్యకు ఫోన్ చేసింది. వెంటనే అన్నయ్య అమ్మను హాస్పిటల్లో చేర్పించారు. తెల్లవారుజామున నేను అమ్మదగ్గరికి వెళ్లాను. అమ్మ నన్ను చూడగానే కోలుకుంది. చక్కగా మాట్లాడింది. అయినా, డాక్టర్లు డబ్బుకోసం అమ్మను ఏకంగా 18 రోజులు ఐసీయూలోనే ఉంచారు. ఇక్కడ ఉంచడం మంచిది కాదని ఆ హాస్పిటల్ వాచ్ మెన్ చెప్పారు. వెంటనే వేరే హాస్పిటల్ కు మార్చాలి అనుకున్నాం. విషయం హాస్పిటల్ వాళ్లకు తెలిసింది. మరుసటి రోజే అమ్మ చనిపోయింది. డబ్బుకోసం డాక్టర్లే అమ్మను చంపేశారు. ఆమె చనిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయా” అని లతాశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: కొంత మంది ఇడియట్స్ ఆ పని చేశారు, ఈ అవార్డు వాళ్లకే అంకితం: షారుఖ్ ఖాన్