బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ గతవారం తన నివాసంలో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ఓ దొంగ కారణంగా జరిగిన ఈ అనుకోని ఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అనంతరం ఆయన పోలీసు భద్రత నడుమ బాంద్రాలోని తన నివాసమైన సద్గురు సదన్ కు చేరుకున్నారు. ఈ కత్తిపోట్ల ఘటన తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన కుటుంబ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సెలబ్రిటీ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రత
తాజా సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ తన ఫ్యామిలీ రక్షణ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏస్ స్క్వాడ్ సెక్యూరిటీ నుంచి సెక్యూరిటీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ రాయ్ సైఫ్ అపార్ట్మెంట్ కు చేరుకొని, దగ్గరుండి భద్రతను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోహిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ బాలీవుడ్ స్టార్లకు సెక్యూరిటీ భద్రతను కల్పిస్తోంది.
5 రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీ ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అడ్డుకోబోయిన సైఫ్ అలీ ఖాన్ ను నిందితుడు మెడ, చేతులు, వెన్నముకపై దాదాపు ఆరుసార్లు కత్తితో పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, భార్య కరీనా కపూర్ ఖాన్ ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. టైంకి ఆసుపత్రికి చేరుకోవడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసే సైఫ్ ను పెను ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చారు. జనవరి 16 తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షరిఫుల్ ఇస్లాం అనే అనుమానితుడిని అరెస్ట్ చేశారు.
షరీఫ్ ఫుల్ గురించి వెలుగులోకి కీలక విషయాలు...
బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు షరీఫుల్ గత ఏడాది వర్లిలోని రెస్టారెంట్లో పని చేశాడు. అక్కడ అతనికి రూ.13000 జీతం కాగా, తన తల్లి వైద్య ఖర్చుల కోసం బంగ్లాదేశ్ కి రూ. 12000 పంపేవాడని తెలుస్తోంది. అయితే అక్కడ ఆగస్టులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ షరీఫుల్ ను పనిలో నుంచి తీసేశారు. ఆ తర్వాత థానేలోని రెస్టారెంట్లో చిన్నపాటి ఉద్యోగం దొరికింది. ఇక ఈ నిందితుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏంటో తాజాగా పోలీసుల విచారణలో వెల్లడించాడు.
దొంగతనం కోసం సైఫ్ ఇంటికి యాదృచ్ఛికంగానే ఎంచుకున్నానని, ధనవంతుల ఇంటి నుంచి డబ్బు దొంగలించి అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించడానికి ఇలా చేశానని షరీఫుల్ వెల్లడించాడు. అంతేకాకుండా దోపిడీ అనంతరం బంగ్లాదేశ్ కి పారిపోవాలని అనుకున్నట్టు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అయితే డిసెంబర్ 15న థానే రెస్టారెంట్ తో కాంట్రాక్ట్ పూర్తి కావడంతో నిందితుడి ఉద్యోగం పోయింది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఇలా దొంగతనానికి పాల్పడ్డట్టు సమాచారం.
Read Also : Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు