పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిన కారణంగా ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇక మీదట సినిమాలు చేయను అంటూ కూడా ప్రకటించారు. కానీ ఆర్థిక అవసరాల నిమిత్తం.. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలనే నిర్ణయానికి రావడంతో పాటు వరుసగా సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో ఇప్పటికే కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా సినిమాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ సినిమా వస్తుంది అంటే మినిమం కలెక్షన్స్ నమోదు అవ్వడం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ కు భారీ పారితోషికం ఇచ్చి సినిమాలను నిర్మించేందుకు క్యూ కడుతున్నారు.
హరిహర వీరమల్లు ఆలస్యం
గతంలో మాదిరిగా ఎక్కువ సమయం సినిమాకు సినిమా కు గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో వెంటనే షూటింగ్ పూర్తై, త్వరగా విడుదల చేయవచ్చు అనుకున్న సినిమాలను పవన్ మొదట చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసిన సినిమాలు. ‘హరిహర వీరమల్లు’ సినిమా పీరియాడిక్ డ్రామా అవ్వడంతో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో ఆ సినిమాను కాస్త పక్కన పెట్టి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ్య సీతమ్’ను, ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాను పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. ఈ రెండు సినిమాలు కూడా కేవలం 30 నుంచి 40 రోజుల కాల్షీట్స్ తో పూర్తి చేయబోతున్నారట. ముఖ్యంగా వినోదయ్య సీతమ్ సినిమాను అతి తక్కువ రోజుల్లోనే ముగించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు
ఒక వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ఆ సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయినా కూడా వెంటనే సినిమాలను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో వినోదయ్య సీతమ్, సాహో సుజీత్ దర్శకత్వంలో సినిమాలను పూర్తి చేయాలని పవన్ వారికి డేట్లు ఇవ్వడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ‘హరి హర వీరమల్లు’ సినిమా కంటే కూడా ముందు ‘వినోదయ్య సీతమ్’ రీమేక్ తో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా హరి హర వీరమల్లు సినిమా తర్వాతే మొదలు అయ్యింది. తక్కువ సమయంలో ఆ సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉంది కనుక ఆ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.. ఇప్పుడు ఈ రెండు సినిమాలను కూడా స్పీడ్ గా ముగించి ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇతర హీరోలూ ఫాలో అవ్వాలి
మొత్తానికి ఒక్కో సినిమాకు నెలలకు నెలలు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ముందుగా కమిట్ అయిన సినిమాలు పూర్తి అయిన తర్వాతే మరో సినిమా అన్నట్లుగా కాకుండా ఏ సినిమా ముందు పూర్తి అయ్యే అవకాశం ఉంటే ఆ సినిమాకు డేట్లు ఇచ్చుకుంటూ షార్ట్ కట్ లో పవన్ కళ్యాణ్ వెళ్లడం అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ పద్దతి ఏదో బాగుంది.. ఇతర హీరోలు కూడా పాటిస్తే ఇంకా బాగుంటుందని సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వెంకటేష్ మహా రాజేసిన రగడ - 'కెజియఫ్' ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మిగతా ముగ్గురు