ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ... మరోవైపు ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వీలు చూసుకుని సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. హరిహర వీరమల్లు సెట్స్‌లో ఆయన అడుగు పెట్టారు. విడుదల తేదీని కూడా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఉదయం ఏడు గంటలకు మొదలైన చిత్రీకరణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న చారిత్రక చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ రోజు (సెప్టెంబర్ 23వ తేదీ) ఉదయం ఏడు గంటలకు తాజా షెడ్యూల్ మొదలు అయింది. అందులో హీరో కూడా జాయిన్ అయ్యారు.
ఏపీ ఎన్నికలలో విజయం సాధించడానికి ముందు నుంచి పవన్ తన కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఎక్కువ సమయం అక్కడ కేటాయించవలసి వస్తోంది. అందువల్ల, పవన్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేలా విజయవాడలోనే 'హరిహర వీరమల్లు' సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ఇప్పుడు అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు.
మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వీరమల్లు
Hari Hara Veera Mallu Movie Release Date: 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలో పవన్ జాయిన్ అయిన సంగతి చెప్పడం మాత్రమే కాదు అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా సినిమా యూనిట్ షేర్ చేసింది. మార్చి 28, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా విడుదల కానుంది.
Also Read: గిన్నిస్ రికార్డుల్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు... తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబురం
మార్చి 27న 'ఓజీ' సినిమా వస్తుందని పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. నిజానికి ఆ సినిమా సెప్టెంబర్ 27 (ఈ శుక్రవారం దేవర విడుదల అయ్యే తేదీకి) థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా పడింది. ఆ తరువాత మార్చికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని వినిపించింది. కానీ, వీరమల్లు టీం డేట్ అనౌన్స్ చేయడంతో ఓజీ ఆ తేదీకి రావడం లేదని అనుకోవాలి. ఇప్పుడు ఆ విషయంలో సందేహాలు అక్కర్లేదు. సుజిత్ సినిమా కంటే ముందు వీరమల్లు థియేటర్లలోకి రానుంది అన్నమాట.
రాబిన్ హుడ్ రోల్ చేస్తున్న పవన్ కళ్యాణ్!
Pawan Kalyan role in hariharaviramalu movie: మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ చేస్తున్నారు. పేద ప్రజలను దోచుకు తినే దొంగలను దోచుకునే బందిపోటుగా ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇప్పటివరకు పవన్ చారిత్రక సినిమా చేయకపోవడం, ఆయన గెటప్ నుంచి సినిమా సెటప్ వరకు ప్రతిదీ కొత్తగా ఉండడంతో అభిమానులలో వీరమల్లుపై ఆసక్తి నెలకొంది.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబి డియోల్ సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం మీద దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తుండగా... ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.