ఈరోజుల్లో ప్రేక్షకులు ఎక్కువశాతం కమర్షియల్ సినిమాలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కొత్త కొత్త చిత్రాలను చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే దర్శకులు కూడా అలాంటి కథలనే సిద్ధం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. అంతే కాకుండా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు కాస్త కమర్షియల్ టచ్ అందిస్తే.. సినిమా హిట్ అని కూడా చాలామంది మేకర్స్ నమ్ముతున్నారు. అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘పార్ట్‌నర్’. ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్ చేస్తున్న తమిళ చిత్రం ‘పార్ట్‌నర్’.. తెలుగులో డబ్ అయ్యింది. తాజాగా దీని తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ట్రైలర్‌లోనే కథ..
ఫ్యాంటసీ, కామెడీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా కలిసి ‘పార్ట్‌నర్’ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఒకవిధంగా ట్రైలర్‌లోనే మొత్తం కథను బయటపెట్టేశారు మేకర్స్. ఈ మూవీలో ఆది పినిశెట్టి, యోగి బాబు దొంగలుగా నటిస్తున్నారు. అదే సమయంలో వారిద్దరికి ఒక ఆఫర్ వస్తుంది. ఒక సైంటిస్ట్ దగ్గర ఉన్న చిప్‌ను దొంగలించి ఇస్తే.. వారికి రూ.20 లక్షలు ఇస్తామంటూ విలన్ ఆఫర్ ఇస్తాడు. ఆ చిప్ కోసం వెళ్లినప్పుడు యోగి బాబుకు అనుకోకుండా ఒక ఇంజెక్షన్ గుచ్చుకొని.. తను హన్సికలాగా మారిపోతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వెండితెరపై చూడాలి అని మేకర్స్.. ట్రైలర్‌ను ముగించేశారు.
యోగిబాబు పాత్ర హైలెట్..
యోగిబాబు.. హన్సికగా మారడం అనేది ‘పార్ట్‌నర్’లో ఎంతో కామెడీని పండించే అంశం అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు తమిళంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక చిత్రం తెరకెక్కలేదు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ మూవీకి సంబంధించిన తమిళ ట్రైలర్ చాలాకాలం ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు ట్రైలర్ మాత్రం తాజాగా దర్శకుడు మారుతీ చేతుల మీదుగా విడుదలయ్యింది. ఆది, హన్సిక మధ్య కంటే ఆది, యోగిబాబు మధ్య కెమిస్ట్రీ సినిమాలో సూపర్‌గా ఉండబోతుంది అంటూ ప్రేక్షకులు అప్పుడే కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
విడుదల ఎప్పుడంటే..
మనోజ్ దామోదరన్ ‘పార్ట్‌నర్’కు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆది, హన్సిక, యోగి బాబుతో పాటు పాలక్ లల్వానీ, పాండిరాజన్ లాంటి తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్ దయానిధి అందించిన సంగీతం.. సినిమాలో కామెడీకి సూట్ అయ్యే విధంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన తమిళ పాటలు కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ‘పార్ట్‌నర్’ తెలుగు, తమిళంలో ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలకానుంది. హన్సిక.. తన కెరీర్‌లో ఇప్పటికీ ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసింది. కానీ ‘పార్ట్‌నర్’లో తను చేస్తున్న పాత్ర కోసం తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని మూవీ టీమ్ ధీమాతో ఉన్నారు.
Also Read: జిమ్‌లో మహేష్ బాబు - ఆ బైసెప్స్ చూశారా? ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial