'సలార్', 'కల్కి 2898 AD' విజయాలతో జోష్ మీదున్న రెబల్ స్టార్ ప్రభాస్... బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఈ సినిమాల తర్వాత 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ జోడీగా పాకిస్తానీ హీరోయిన్ నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నటి సజల్ అలీని మరో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ వార్త ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ సర్కిల్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ తో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నానని, ఇదొక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని డైరెక్టర్ హను రాఘవపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే డిఫెరెంట్ లవ్ స్టోరీ అని, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు జరిగే కథను చెప్పబోతున్నారని టాక్ నడిచింది. అంతే కాదు ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడి పాత్రలో కనిపిస్తారనే రూమర్ కూడా వినిపించింది. ఈ క్రమంలో సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఓ పాన్ ఏషియన్ నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని కోసం సజల్ అలీని సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు.
పాక్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో సజల్ అలీ ఒకరు. 2017లో 'మామ్' అనే హిందీ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. దివంగత శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ, సజల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఎందుకనో ఆ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు అందించలేకపోయింది. అయితే ఇన్నాళ్లకు 'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి సంగీతం సమకూర్చనున్నారు. ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తైనట్లుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా కోసం భారీ సెట్లు నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
Also Read: మహేశ్ బాబుని ప్రచారం కోసం వాడేసుకుంటున్న 'కమిటీ కుర్రోళ్లు'