Committee Kurrollu Release Date: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తమ ఫ్యామిలీ వేసిన బాటలోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన మెగా డాటర్.. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా బిజీ అవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి, సొంతంగా సినిమాలు నిర్మిస్తోంది. ఆమె బ్యానర్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 9వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 


ఆగస్టు 9 అనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన రోజు. ఒకరకంగా పండగ రోజు. ఎందుకంటే అది మహేశ్ బాబు పుట్టినరోజు. ఇప్పుడు దాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’ తమ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా చిత్ర బృందం ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కొంతమంది కుర్రాళ్లు రెండు టీమ్స్‌గా విడిపోయిన 'బాబు అంటే మహేష్ బాబే.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్' అంటూ 'గుంటూరు కారం' పోస్టర్ దగ్గర హంగామా చేస్తుంటారు. మహేశ్ బాబు బర్త్ డే కోసం మీరు కేక్ కటింగ్స్ చేస్తున్నారు, కానీ మేం ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా సినిమానే రిలీజ్ చేస్తున్నాం' అని విడుదల తేదీని ప్రకటించారు. మెగా ఫ్యామిలీ నిర్మాతలు ఇలా మహేశ్ బాబు పుట్టినరోజుని తమ మూవీ ప్రమోషన్స్ కోసం వాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 






గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌‌గా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంతో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌‌ని పరిచయం చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ‌, ప‌ల్లెటూరిలోని రాజ‌కీయాలు, యువ‌త ప‌డే సంఘ‌ర్ష‌ణ అన్నింటినీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌‌కు ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇటీవల 'ఆయ్' మూవీ టీంతో కలిసి నిర్వహించిన క్రికెట్ క్లాష్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. 


‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు. నిహారిక సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మించారు. దీనికి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయగా.. వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల ఈ చిత్రానికి సంభాషణలు రాశారు.


న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఎక్కువ మంది కొత్త వాళ్ల‌తో ఈ సినిమా చేసినట్లుగా నిర్మాతలు తెలిపారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక వంటి నూతన నటీనటులు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి, కంచెరపాలెం కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంతకముందు 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ నిర్మించిన నిహారిక కొణిదెల.. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 


Also Read: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా వాట్సాప్ చాట్ లీక్ - ఆ హోటల్ లో.. 'తిరగబడరసామీ' జంట అడ్డంగా బుక్కైనట్టేనా?