Ranbir Kapoor: మామూలుగా సినీ సెలబ్రిటీలు అంటే వారికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండాలి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఉండే నటీనటులు కూడా ఉన్నారు. అందులో ఒకడు రణబీర్ కపూర్. బాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రణబీర్. కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం తను పెద్దగా బయట కనిపించే వ్యక్తి కాదు. అంతే కాకుండా తనకు అఫీషియల్‌గా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. తాజాగా నిఖిల్ కామత్ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రణబీర్.. ఓపెన్‌గా మాట్లాడడం చూసి తన ఫ్యాన్స్ షాకవుతున్నారు.
నాన్నకు కోపం ఎక్కువ..
తాజాగా నిఖిల్ కామత్ హోస్ట్ చేసే ‘పీపుల్’ పోడ్కాస్ట్‌కు గెస్ట్‌గా వచ్చాడు రణబీర్ కపూర్. ఆ పోడ్కాస్ట్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ‘‘నీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మీరు చెప్పండి. నా జీవితానికి సంబంధించినవి నేను చెప్తాను’’ అని నిఖిల్ అడగగా.. ‘‘ఇప్పుడు నేను ఒక్కడినే పెద్ద డైలాగ్ చెప్పాలా ఏంటి’’ అంటూ రణబీర్ వేసే కౌంటర్‌తో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది. బాలీవుడ్ గురించి తనకు ఎక్కువ తెలియదు అని నిఖిల్ అనగానే గ్రేట్ అంటూ వ్యంగ్యంగా అన్నాడు రణబీర్. తన చిన్నతినం గురించి చెప్పమని అడగగా.. ‘‘మా నాన్నకు కోపం ఎక్కువ. కానీ తను చాలా మంచి మనిషి’’ అని చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.
థెరపీకి వెళ్లాను..
‘‘నేను ఎప్పుడూ తలదించుకునే ఉండేవాడిని. అన్నింటికి ఓకే అనే చెప్పేవాడిని. దేనికి నో అని చెప్పలేదు’’ అని తన గురించి చాలామందికి తెలియని విషయాన్ని బయటపెట్టాడు రణబీర్ కపూర్. ఇక రాహా పుట్టిన తర్వాత తన జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎవరో నా గుండెను నాలో నుండి బయటికి తీసి నా చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది. రాహా.. ఆలియాలో ఒక భాగం. నాతో మాత్రం రాహా ఎప్పుడూ ఫన్‌గా ఉండాలని అనుకుంటుంది’’ అని అన్నాడు. ఇక తన గురించి చెప్తూ.. ‘‘నేను ఏదీ బయటికి చెప్పుకోను. ఏడవను. నేను థెరపీ కూడా ప్రయత్నించాను. నేను థెరపీకి వ్యతిరేకం కాదు. నేను ఓపెన్‌గా మాట్లాడాలి. కానీ అలా చేయాలంటే నాకు భయం. కానీ థెరపీ అనేది మైండ్‌కు జిమ్ లాగా పనిచేస్తుంది’’ అని రివీల్ చేశాడు రణబీర్.
చీటర్ అన్నారు..
రణబీర్ కపూర్ లవ్ స్టోరీలు బాలీవుడ్‌లో చాలా ఫేమస్. మొదటిసారి ఈ పోడ్కాస్ట్‌లో తన ప్రేమకథల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడాడు. ‘‘నేను ఇద్దరు సక్సెస్‌ఫుల్ హీరోయిన్లను డేట్ చేశాను. ఆ తర్వాత అదే నా ఐడెంటిటీ అయిపోయింది. చాలాకాలం అందరూ నన్ను ఛీటర్ అని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికీ చాలామంది అదే అనుకుంటున్నారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్ కపూర్.
Also Read: ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్ - ఎట్టకేలకు టబు లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్